Supreme Court On Pegasus Spyware Case: దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసిన పెగాసస్ స్పైవేర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అందచేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారించింది. 29 ఫోన్లను పరిశీలించగా.. 5 ఫోన్లలో మాల్‌వేర్‌లు గుర్తించామని..అయితే పెగాసస్ స్పైవేర్ కు సంబంధించి ఎలాంటి రుజువు లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అయితే ఈ విచారణ సమయంలో భారత ప్రభుత్వం తమకు సహకరించలేదని కమిటీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
రాజకీయనాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను ట్రాప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తోందని విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ పర్యవేక్షణలో కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను మూడు భాగాలుగా సమర్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నివేదికలోని ఒక భాగాన్ని పబ్లిక్ గా ఉంచతామని సీజేఐ తెలిపారు. అయితే పూర్తి నివేదికను పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో ప్రచురించవద్దని కమిటీ కోరింది. పూర్తి నివేదిక పరిశీలించకుండా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
Read Also: PM Security Breach Case: ప్రధాని భద్రతా వైఫల్యంలో పంజాబ్ ఎస్ఎస్పీదే బాధ్యత: సుప్రీంకోర్టు
ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ డెవలప్ చేసిన స్పైవేర్ ను ఉపయోగించి ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం స్నూప్ చేస్తుందని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరడంతో కమిటీని నియమించింది. ‘‘ది వైర్’’ వార్తా పోర్టల్ భారత్ లోని 142 మంది కన్నా ఎక్కువ మందిని లక్ష్యంగా చేసుకుని పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించారని పేర్కొంది. ఈ జాబితాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు, మాజీ న్యాయమూర్తి , 40 మంది పాత్రికేయులు ఉన్నారని పేర్కొంది. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో పెగాసస్ రచ్చ మొదలైంది.
