Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బిల్కిస్ బానో అత్యాచారం కేసులోొ 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బాధితురాలు బిల్కిస్ బానో. ఇదిలా ఉంటే బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది తప్పుకున్నారు.
Read Also: Raja Pateriya: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్
బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేయడంతో పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన నేరం కింది ఈ 11 మందిని దోషులు గుర్తించి వారికి జీవిత ఖైదు విధించింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాల కింది బిల్కిస్ బానో కేసులో శిక్ష పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదల రాజకీయ రచ్చకు దారి తీసింది. విపక్షాలు గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించాయి. వీరంతా విడుదలైన తర్వాత పలువురు బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
2002 గుజరాత్ అల్లర్లు జరుగుతున్న సమయంలో మార్చి 3,2022న 21 ఏళ్లు ఉన్న 5 నెలల గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హత్య చేశారు. గోద్రాలో సబర్మతి రైల్ కోచ్ దహనం తరువాత.. కరసేవకులు చనిపోయిన తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకున్నాయి. బిల్కిస్ బానోపై అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మందికి ముంబై స్పెషల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఆ తరువాత బాంబే హైకోర్టు ఈ శిక్షను సమర్థించింది. కొన్ని రోజుల క్రితం వీరంతా విడుదలయ్యారు. ఈ విడుదలను వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో న్యాయపోరాటం చేస్తోంది.
