Site icon NTV Telugu

Supreme Court: అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపై విచారణ.. ఎందుకు అనుమతిస్తున్నారు.?

అక్రమ లేఅవుట్లని తరచూ క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కల్పించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇవాళ విచారణ జరిగింది.. దువ్వాడు సాగర్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటీషన్ పై విచారణ సాగింది.. తెలంగాణలో అక్రమ “లేఅవుట్లు”లో ప్లాట్ల రిజస్ట్రేషన్‌ను అనుమతిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది.. తెలంగాణలో అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరించాలని 20 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.. అక్రమ లేఅవుట్లకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవడం లేదన్న పిటిషనర్‌.. సప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే ఏపీలో 46 వేల అక్రమ ప్లాట్లని క్రమబద్దీకరించినట్లు ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

Read Also: Telangana: మారనున్న ఇంటర్‌ పరీక్షల తేదీలు

ఇక, అక్రమ లేఅవుట్లలో క్రయవిక్రయాలను ఎందుకు అనుమతిస్తున్నారని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఈ సందర్భంగా ప్రశ్నించారు జస్టిస్ లావు నాగేశ్వరరావు. అక్రమ లేఅవుట్లని తరచూ క్రమబద్దీకరించే అవకాశాలు ప్రభుత్వాలు కల్పించడం సరైంది కాదన్న ఆయన.. దీని చట్టబద్దతను నిర్ణయించడం కోసమే, అన్ని రాష్ట్రాలను పార్టీలుగా చేర్చి విచారణ చేస్తున్నామన్న తెలిపారు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకునే లేఅవుట్లను తెలంగాణ ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు.. ఇక, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. సీబీఐతో సహా, మిగిలిన కొంతమంది పార్టీలు కూడా కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉందంటూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిఆ వేశారు.

Exit mobile version