BBC Documentary On Modi: ఇండియాతో పాటు బ్రిటన్ లో కూడా వివాదాస్పదం అయింది ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీతో తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ భారత ప్రధానిపై విమర్శలు చేస్తే, పలువురు ఎంపీలు మోదీకి మద్దతుగా నిలిచారు.
Read Also: Kantara: వరాహరూపం కాంట్రవర్సీ… సుప్రీమ్ కోర్టులో మేకర్స్ కి ఊరట
ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంట్ నేపథ్యంలో బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని తిరస్కరించింది. దీన్ని తప్పుడు భావనగా పేర్కొంది. ఒక డాక్యుమెంటరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్.. బీబీసీ ఉద్దేశపూర్వకంగా భారత ప్రతిష్టను కించపరుస్తుందని వాదించారు. ఈ డాక్యుమెంటరీ వెనక కుట్ర దాగి ఉందని ఎన్ఐఏతో విచారణ దర్యాప్తు చేయాలని కోరారు.
ఈ డాక్యుమెంటరీ లింకులను తొలగించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్, యూట్యూబ్ లను ఆదేశించింది. దీని కారణంగా పలు యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ జె ఎన్ యూ ల్లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు వర్సిటీ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా లెఫ్ట్ విద్యార్థి సంఘాలు దీన్ని ప్రదర్శించడంతో బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.