Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!

  • వందేమాతరం వివాదంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదనలు
  • ఈ సందర్భంగా 1986 తీర్పు ప్రస్తావించిన న్యాయస్థానం
  • వివాదం వేళ 2 వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం
Supremecourt5

Supremecourt5

వందేమాతరం గేయంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతున్న వేళ మంగళవారం సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా 1986 తీర్పు ప్రస్తావన తీసుకొచ్చింది. ‘బిజోయ్ ఇమ్మాన్యుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ఆంశాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. మతపరమైన విశ్వాసాల కారణంగా జాతీయ గీతం పాడని ముగ్గురు విద్యార్థుల హక్కులను న్యాయస్థానం పరిరక్షించింది. తిరిగి నాలుగు దశాబ్దాల తర్వాత అదే తీర్పు ప్రస్తుత వందేమాతరం వివాదం కారణంగా కీలకంగా మారింది.

వందేమాతరంలోని ఆరు చరణాలను తప్పనిసరిగా పాడాలని కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం. కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2026 సెప్టెంబర్ 22న పిటిషన్ విచారణ సందర్బంగా సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మొహనా కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. మతపరమైన లేదా మనస్సాక్షికి సంబంధించిన నిజమైన అభ్యంతరాల కారణంగా వందేమాతరం పాడని వ్యక్తులపై క్రిమినల్ చర్యలు ఉండకూడదన్న అంశాన్ని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా 1986 నాటి బిజోయ్ ఇమ్మాన్యుయేల్ తీర్పు ఇప్పటికీ వర్తిస్తుందని జస్టిస్ బాగ్చి సూచించారు. వందేమాతరంలో అన్ని చరణాలు పాడని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. మత విశ్వాసాల కారణంగా గేయం పాడకూడదనుకునే వారిపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోలేరని సూచనపూర్వకంగా సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించే శిక్షాత్మక చర్యల అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. దీంతో వందేమాతరం సవరణ చట్టం, మార్గదర్శకాలపై 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

అసలు ‘బిజోయ్ ఇమ్మాన్యుయేల్’ కేసు ఏంటి?

1986లో కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులు బిజోయ్, బిను మోల్, బిందు ఇమ్మాన్యుయేల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరు ‘Jehovah’s Witnesses’ (యెహోవా సాక్షుల విశ్వాసం) మత విశ్వాసాలకు చెందినవారు. పాఠశాలలో ప్రతిరోజూ జరిగే ప్రార్థనా సమయంలో జాతీయ గీతం ‘జనగణమన’ పాడినప్పుడు వారు గౌరవంగా నిలబడేవారు. అయితే తమ మత విశ్వాసాల కారణంగా జాతీయ గీతాన్ని మాత్రం పాడేవారు కాదు. వారి అభ్యంతరం జాతీయ గీతంలోని పదాలు లేదా భావాలపై కాదని.. తమ మత విశ్వాసాల ప్రకారం దానిని పాడటం సాధ్యం కాదని వారు పేర్కొన్నారు. 1985లో ఓ ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రస్తావించడంతో విచారణ జరిగింది. ఆ విచారణలో విద్యార్థులు చట్టాన్ని గౌరవించే వారని, జాతీయ గీతాన్ని అగౌరవపరిచినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. అయినప్పటికీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జూలై 26, 1985లో స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులను బహిష్కరించారు. దీంతో బాధిత కుటుంబాలు కేరళ హైకోర్టును ఆశ్రయించినా అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

అప్పట్లో జస్టిస్ ఓ. చిన్నప రెడ్డి, జస్టిస్ ఎం.ఎం. దత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 1986 ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. విద్యార్థుల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 25(1) హక్కులు ఉల్లంఘించబడ్డాయని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో కీలకమైన అంశం.. జాతీయ గీతాన్ని గౌరవించడం ఒకటి, దాన్ని తప్పనిసరిగా పాడటం మరోటి అని గుర్తించింది. జాతీయ గీతం పాడుతున్నప్పుడు గౌరవంగా నిలబడిన వ్యక్తి స్వయంగా పాటలో పాల్గొనకపోవడం మాత్రమే జాతీయ గీతాన్ని అగౌరవపరిచినట్లు కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ గీతం పాడుతున్నప్పుడు గౌరవంగా నిలబడటం ద్వారా కూడా తగిన గౌరవం చూపినట్లేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఆర్టికల్ 19(1)(a) ఏం చెబుతోంది?

ఆర్టికల్ 19(1)(a) పౌరులకు వాక్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పిస్తుంది. విద్యార్థులు జాతీయ గీతం పాడాల్సిందేనని కేరళ విద్యాశాఖ జారీ చేసిన కొన్ని ఆదేశాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. అవి చట్టబద్ధమైన నిబంధనలు కాకుండా కేవలం శాఖాపరమైన ఆదేశాలని కోర్టు గుర్తించింది. అలాంటి ఆదేశాల ఆధారంగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిమితం చేయలేమని స్పష్టం చేసింది. మతపరమైన నిజమైన అభ్యంతరం ఉన్నప్పటికీ ప్రతి విద్యార్థి జాతీయ గీతం పాడేలా బలవంతం చేస్తే.. అది ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 25(1) కింద ఉన్న హక్కులకు విరుద్ధంగా మారుతుందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మరో కీలకమైన రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 25(1). ఇది వ్యక్తులకు మనస్సాక్షి స్వేచ్ఛతో పాటు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును కల్పిస్తుంది. ఒక మత విశ్వాసం న్యాయమూర్తి వ్యక్తిగత అభిప్రాయాలకు నచ్చుతుందా లేదా అనేది ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ విశ్వాసం వ్యక్తి నిజంగా మనస్సాక్షితో తన మతంలో భాగంగా పాటిస్తున్నదా అనేదే పరిశీలించాల్సిన అంశమని తెలిపింది. అందువల్ల తమ మత విశ్వాసాల కారణంగా జాతీయ గీతం పాడకుండా.. అదే సమయంలో గౌరవంగా నిలబడిన విద్యార్థులపై చర్య తీసుకోవడం వారి మత స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛను ఇబ్బంది పెట్టినట్లే అవుతుందని సుప్రీంకోర్టు తేల్చింది.

ఆ కేసులో విద్యార్థులకు నిజమైన మతపరమైన అభ్యంతరం ఉంది. అదే సమయంలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు వారు గౌరవంగా నిలబడేవారు. జాతీయ గీతం వినిపించినప్పుడు నిలబడటానికి కూడా నిరాకరించలేదని సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. నిజమైన మతపరమైన అభ్యంతరం ఉన్న వ్యక్తిని, గౌరవం చూపుతున్నప్పటికీ పాట పాడలేదనే కారణంతో ప్రభుత్వం శిక్షించగలదా అనే అంశం ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ అవుతోంది.

ఇప్పుడెందుకు ప్రస్తావన?

కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ.. వందేమాతరం పూర్తి ఆరు చరణాలను నిర్దిష్ట అధికారిక, సాంస్కృతిక, ఇతర కార్యక్రమాల్లో పాడాల్సిందేనంటూ కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేశారు. అలాగే Prevention of Insults to National Honour Act, 1971లో 2026లో చేసిన సవరణను కూడా ఆయన సవాలు చేశారు. ఈ సవరణ ప్రకారం జాతీయ గీతం లేదా జాతీయ గీతం (National Song) పాడటాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరంగా మారింది. కొన్ని సందర్భాల్లో గరిష్ఠంగా మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. కృష్ణ వాదన ప్రకారం.. కేంద్రం ఆదేశాలు, సవరించిన శిక్షా నిబంధనలను కలిపి చూస్తే ఆరు చరణాల వందేమాతరం గానం చేయడానికి వ్యక్తులను పరోక్షంగా బలవంతం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. నిజమైన మతపరమైన లేదా మనస్సాక్షికి సంబంధించిన అభ్యంతరాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) రక్షణ కల్పిస్తుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆరు చరణాలపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ప్రస్తుతం కోర్టు ప్రధానంగా పరిశీలిస్తున్నది వందేమాతరం ఎన్ని చరణాలతో ఉండాలి? అనే అంశం కాదని, దానిని పాడకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చా? అనే రాజ్యాంగపరమైన అంశమని విచారణలో స్పష్టమైంది. జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఏ రూపంలో ఉండాలి, ఎన్ని చరణాలను అధికారికంగా పరిగణించాలి వంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని జస్టిస్ బాగ్చి సూచించినట్లు తెలుస్తోంది. కోర్టు తన అభిప్రాయం ఆధారంగా జాతీయ భావోద్వేగాన్ని నిర్ణయించబోదని కూడా ఆయన స్పష్టం చేశారు.

‘పాడకపోతే శిక్షించకూడదు’

ప్రస్తుత విచారణలో Bijoe Emmanuel తీర్పు ప్రాధాన్యత ఇదే అంశంలో కనిపిస్తోంది. 1986 తీర్పులో ఏర్పడిన న్యాయ సూత్రం ఇప్పటికీ వర్తిస్తుందని జస్టిస్ బాగ్చి సూచించారు. నిజమైన మతపరమైన లేదా మనస్సాక్షికి సంబంధించిన అభ్యంతరం కారణంగా వందేమాతరంలోని ఒకటి లేదా అన్ని చరణాలను పాడేందుకు నిరాకరించే వ్యక్తిపై క్రిమినల్ చర్య ఉండకూడదనే అంశాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. అయితే తుది రాజ్యాంగ తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.

కేంద్రానికి రెండు వారాల గడువు

టీఎం కృష్ణ పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో వందేమాతరం గానం, వ్యక్తిగత మనస్సాక్షి, మత స్వేచ్ఛ, క్రిమినల్ శిక్షల మధ్య ఉన్న రాజ్యాంగపరమైన సంబంధంపై విచారణ కొనసాగనుంది.

1986లో ముగ్గురు విద్యార్థులకు ఏం జరిగింది?

1986లో సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పులను పక్కనపెట్టి.. బిజోయ్, బిను మోల్, బిందు ఇమ్మాన్యుయేల్‌లను తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని ఆదేశించింది. వారి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఆ తీర్పు రాజ్యాంగ సహనం ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం మరోసారి వివాదం కారణంగా దాదాపు 40 ఏళ్ల తర్వాత Bijoe Emmanuel తీర్పు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వందేమాతరం కేసులో రాజ్యాంగపరమైన ప్రశ్నలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. కేంద్రం సమాధానం దాఖలు చేసిన తర్వాత ఈ అంశాలపై తదుపరి విచారణ ఎలా జరుగుతుందో చూడాలి.

‘నక్సలైట్’ వ్యాఖ్యపై రగడ

ఇక మంగళవారం విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సీనియర్ అడ్వకేట్ ఎస్. మురళీధర్ మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. వందేమాతరంపై సరైన చర్చ లేకుండా.. జాతీయంగా ఏకాభిప్రాయం లేకుండా కేంద్రం ఆమోదించిందని మురళీధర్ వాదించారు. చట్టాల రూపకల్పనలో పైనుంచి కిందికి వచ్చే విధానం ద్వారా కాకుండా.. ఆదర్శవంతంగా ఇటువంటి విషయాలు ప్రజాభిప్రాయం ద్వారా రూపుదిద్దుకోవాలని మురళీధర్ కోరారు.

మురళీధర్ వ్యాఖ్యలకు తుషార్ మెహతా బదులిస్తూ.. ‘‘చట్టాల రూపకల్పన రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. నక్సలైట్ల ఆలోచనల ప్రకారం చట్టాల రూపకల్పన కుదరదు.’’ అని వ్యాఖ్యానించారు. మెహతా చేసిన నక్సలైట్ వ్యాఖ్యపై మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నక్సలైట్ వ్యాఖ్యను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు మెహతా నిరాకరించారు. తాను చట్టాల రూపకల్పనకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను మాత్రమే ప్రస్తావించానని వివరించారు. ‘‘అది రాజ్యాంగబద్ధమైన మార్గం, నక్సలైట్లు కోరుకునేది కాదు అని నేను చెప్పాను. అందుకు నేను చింతించడం లేదు.’’ అని సొలిసిటర్ జనరల్ సమర్థించుకున్నారు. ఇలాంటి వ్యాఖ్య ఒక న్యాయాధికారికి తగనిదని మురళీధర్ మరోసారి అభ్యంతరం తెలిపారు. ‘‘అతను మళ్లీ అదే పునరావృతం చేస్తున్నాడు. నేను ఇక నా అత్యంత తీవ్రమైన నిరసనను తెలియజేయబోతున్నాను.’’ అని మురళీధర్ అన్నారు.

వెంటనే న్యాయమూర్తి జయమల్య బాగ్చి జోక్యం చేసుకుంటూ… ఈ వాగ్వాదం ‘‘అనవసరమైన ఉద్రిక్తత, భావోద్వేగాన్ని’’ సృష్టించిందని అభివర్ణించారు. అయితే సొలిసిటర్ జనరల్ అటువంటి పదాన్ని ఉపయోగించి ఉండకూడదని మురళీధర్ మళ్లీ ప్రస్తావించారు. ఆయనే మొదలుపెట్టారు. సొలిసిటర్ ఇలాంటి పదాన్ని ఎందుకు వాడుతున్నారు? ఇది ఒక న్యాయాధికారికి తగనిది. ఏ న్యాయాధికారి కూడా ఈ పదాన్ని వాడటం నేను ఎప్పుడూ వినలేదు.’’ అని మురళీధర్ అన్నారు.

అనంతరం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జోక్యం చేసుకుని కోర్టు ముందున్న న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించాలని న్యాయవాదులను కోరారు. ‘‘మనం రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన చట్టపరమైన అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం. దానికి మాత్రమే పరిమితమవుదాం.’’ అని సీజేఐ అన్నారు. మురళీధర్ జోక్యం చేసుకుని ‘‘న్యాయాధికారుల నుంచి మర్యాదను ఆశిస్తారు.’’ అని తెలిపారు. కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయగా.. మురళీధర్ ఆ విషయాన్ని మళ్లీ లేవనెత్తి తన నిరసనను కూడా నమోదు చేయాలని కోరారు.

వెంటనే సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుని తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని మళ్లీ స్పష్టం చేశారు. ‘‘నేను చెప్పినదాన్నే మళ్ళీ చెప్పగలను. ఆ నిర్ణయం పార్లమెంటు తీసుకుంది. అది రాజ్యాంగబద్ధమైన విధానమని, నక్సలైట్లు కోరుకునేది కాదని నేను చెప్పాను. దాని గురించి నాకు ఎలాంటి విచారం లేదు.’’ మెహతా మళ్లీ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మరో కేసు నిమిత్తం కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే జోక్యం చేసుకుని… ‘‘స్వతంత్రంగా ఆలోచించగలగడం నక్సలైట్ కావడం కాదు..’’ అని అన్నారు. ఒకరిని నక్సలైట్‌గా ముద్ర వేసినప్పటికీ.. దానివల్ల వారి రాజ్యాంగ హక్కులు హరించుకుపోవని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. అయినా ‘‘ఒకరిని నక్సలైట్ అని ముద్ర వేసినప్పటికీ.. వారు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోరు.’’ అని జస్టిస్ బాగ్చి అన్నారు. మళ్లీ సీనియర్ న్యాయవాది హెగ్డే జోక్యం చేసుకుని ‘‘ఆలోచించడం అంటే నక్సలైట్ కావడం కాదు.’’ అని బదులిచ్చారు.

తర్వాత బెంచ్ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు చివరికి ఈ వ్యాఖ్యలను రికార్డులోకి తీసుకోలేదని.. పిటిషన్‌లో లేవనెత్తిన రాజ్యాంగపరమైన అంశాలపైనే విచారణను కొనసాగిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వివాదం అక్కడితో ముగిసింది.