NTV Telugu Site icon

Covishield: కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళన.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..

Supreme Court Agrees To Hear Plea Over Covishield Side Effect Concern

Supreme Court Agrees To Hear Plea Over Covishield Side Effect Concern

Covishield: బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తం రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయని ఇటీవల అంగీకరించింది. ఈ విషయం వ్యాక్సిన్ తీసుకున్న జనాల్లో భయాందోళనల్ని రేకెత్తించింది. దీనిని ఇండియాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి ‘‘కోవిషీల్డ్’’ వ్యాక్సిన్‌ పేరుతో ప్రజలకు అందించింది. అయితే, కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలపై దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు విచారించేందుకు అంగీకరించింది. విచారణ తేదీని నిర్ణయించలేదు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ సమస్యను అంగీకరించారు, పిటిషన్‌లో దుష్ప్రభావాలపై దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందం మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఈ పిటిషన్‌పై ముందస్తు విచారణను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Read Also: Kottu Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం.. గందరగోళం సృష్టించాలని ప్లాన్‌..!

పిటిషనర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్, ఇతర సంభావ్య ప్రమాదాలను పరిశీలించేందుకు నిపుణులతో ప్యానెల్ ఏర్పాటు చేయాలని, ఈ దర్యాప్తును రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షించాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు వికలాంగులుగా మారారని, వారికి నష్టపరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ఇటీవల తమ టీకాతో అరుదైన సందర్బాల్లో TTS లేదా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌‌కి కారణమవుతుందని, దీని వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కి దారితీస్తుందని ఆస్ట్రాజెనికా అంగీకరించింది. యూకేలో న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 2021లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో ఓ వ్యక్తి మెదడులో గాయం ఏర్పడింది. దీనిపై న్యాయపోరాటం ప్రారంభమైంది. ముందుగా తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని ఆస్ట్రాజెనికా చెప్పినప్పటికీ, ఇటీవల కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే టీటీఎస్‌కి కారణమవుతుందని అంగీకరించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇండియాలో కూడా కొందరు చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చనిపోయిన వారి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ని విచారించేందుకు అంగీకరించింది.