NTV Telugu Site icon

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌ని కలిసేందుకు భార్య సునీతాకు నో పర్మిషన్..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. సోమవారం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ జైలులో కలవాల్సి ఉంది. అయితే, దీనికి తీహార్ జైలు అధికారులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అనుమతి నిరాకరించడానికి ఎలాంటి కారణాలను అధికారులు పేర్కొన లేదని ఆప్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ మంత్రి అతిషి రేపు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు.

Read Also: Hinglaj Mata festival: పాకిస్తాన్‌లో “హింగ్లాజ్ మాత” తీర్థయాత్ర.. లక్షలాదిగా హిందువులు హాజరు..

ఆప్ చెబుతున్న దాని ప్రకారం.. ఇద్దరికి అనుమతుల్ని ఒకేసారి మంజూరు చేశారని, అయితే వారు సునీతా కేజ్రీవాల్‌కి అనుమతి నిరాకరించారని చెబుతోంది. మంగళవారం పంజాబ్ సీఎం భగవత్ మాన్ కూడా కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు. ఈ వరస సమావేశాల కారణంగా సునీతా కేజ్రీవాల్‌కి అనుమతి నిరాకరించబడిందని, ఈ సమావేశాల తర్వాత తన భర్తను కలిసేందుకు అనుమతిస్తామని తీహార్ జైలు వర్గాలు తెలిపాయి. జైలు మాన్యువల్ ప్రకారం, ఒక ఖైదీని ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మరియు వారంలో గరిష్టంగా నలుగురు కలవవచ్చు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఢిల్లీలోని అధికార నివాసంలో కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా ఈడీ పేర్కొంది. మద్యం వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంలో నేరుగా ప్రమేయం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈడీ వాదనల్ని ఆప్ ఖండించింది. జైలులో ఉన్నప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ చెప్పింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ని రేపు సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.