Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

  • పాత మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేస్తుండగా పేలుడు
  • నలుగురు CRPF సిబ్బందికి గాయాలు
Four Crpf Personnel Were In

Four Crpf Personnel Were In

Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (CRPF)కు చెందిన నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ల (ASI) పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని కొంటా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, CRPF 50వ బెటాలియన్‌కు చెందిన అమ్యూనిషన్ టెక్నికల్ టీమ్‌లో ఈ నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు.

తనిఖీలు నిర్వహించడంతో పాటు మిగిలిపోయిన, ఉపయోగించని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు వారు జగదల్‌పూర్ నుంచి ఎలార్మడుగు క్యాంపునకు చేరుకున్నారు. భేజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలార్మడుగు భద్రతా శిబిరం సమీపంలో గురువారం సాయంత్రం పాత పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు CRPF సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

గాయపడిన సిబ్బంది వివరాలు

ఎం.కే. తివారీ – అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ASI)
అనీస్ ఖాన్ – అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ASI)
కుల్దీప్ రాజ్ – హెడ్ కానిస్టేబుల్
అమర్‌నాథ్ మిశ్రా – ఇన్‌స్పెక్టర్

వీరిలో ASIలు ఎం.కే. తివారీ, అనీస్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం వారిని మరో ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, భేజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంపులో CRPF సిబ్బంది సాధారణ విధుల్లో భాగంగా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. పనికిరాని గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందని, ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు పదార్థాల శకలాలు తగలడంతో నలుగురు జవాన్లు గాయపడ్డారని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గతంలో నక్సల్స్ కార్యకలాపాలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది.