NTV Telugu Site icon

Supreme court: చట్టాలు భర్తలను దోచుకునే సాధనాలు కాదు.. భరణంపై సుప్రీం కీలక వ్యాఖ్య

Supremecourt

Supremecourt

బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ ఆత్మహత్య తర్వాత.. మహిళలు చట్టాలను ఉపయోగించుకుని చేస్తున్న అరాచకాలు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. తన భార్య, అత్త కుటుంబ సభ్యులు పెట్టిన వేధింపులను 90 నిమిషాల వీడియో ద్వారా.. 40 పేజీల లేఖలో తెలియజేసి అతుల్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మహిళలు చట్టాలను అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది.

తాజాగా భరణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ చట్టాలలోని నిబంధనలు మహిళలను రక్షించడానికి మాత్రమేనని, అంతేతప్ప వారి భర్తలను శిక్షించడం, బెదిరించడం, ఆధిపత్యం చెలాయించడం లేదా బలవంతంగా వసూలు చేయడానికి కాదని సుప్రీంకోర్టు వ్యా్ఖ్యానించింది.

విడిపోయిన భార్యకు ఒక నెలలో రూ.12 కోట్ల శాశ్వత భరణం చెల్లించాలంటూ ధర్మాసనం ఆదేశించింది. విడిపోయిన భార్య.. తన భర్త సంపాదన నుంచి సమానమైన శాశ్వత భరణం కోరింది. ఈ మేరకు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలు బలవంతంగా భర్తల నుంచి వసూలు చేయడానికి ఉద్దేశించినవి కావని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, పంకజ్ మిథాల్ మాట్లాడుతూ.. హిందూ వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా పరిగణిస్తారని.. ఒక కుటుంబానికి పునాదిగా పరిగణించబడతారన్నారు. అంతేతప్ప వివాహ వ్యవస్థ ‘‘వాణిజ్య వెంచర్’’ కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. మహిళలు తమ చేతుల్లో ఉన్న చట్టాలను సంక్షేమానికి ఉపయోగించుకోవాలి కానీ.. భర్తలను శిక్షించడం కోసమో.. బెదిరించడం కోసమో.. లేదంటే ఆదిపత్యం చెలాయించడం కోసమో కాదని బెంచ్ పేర్కొంది. పోలీసు అధికారులు కూడా కొన్నిసార్లు సెలెక్టివ్ కేసుల్లో త్వరగా చర్య తీసుకుంటారని.. భర్త లేదా అతని బంధువులను కూడా అరెస్టు చేస్తున్నారని బెంచ్ ధ్వజమెత్తింది.

సంపదను సమయం చేయడానికి భరణం ఒక మార్గం కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సమమైన భరణం కోరడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా మంది ఈ విధంగానే కోరుతున్నారని.. ఇలాంటి కేసులే ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. ఒక వేళ భర్త పేదవాడిగా మారితే.. భార్య సంపదను సమం చేయడానికి ఇష్టపడుతుందా? అని బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.