Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు

  • హార్ముజ్‌లో వాణిజ్య నౌకపై దాడి..
  • 11 మంది భారతీయులకు గాయాలు..
  • ఆస్పత్రికి తరలించిన ఒమన్ అధికారులు..
Strait Of Hormuz

Strait Of Hormuz

Hormuz Strait: హార్ముజ్ జలసంధిలో మరోసారి భారతీయ నావికులు ఉన్న నౌకపై దాడి జరిగింది. పనామా జెండా కలిగిన ఎంటీ ఆన్ పీస్ నౌకపై మంగళవారం ఒక ప్రొజెక్టైల్‌తో దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన 12 మంది సిబ్బందిలో 11 మంది భారతీయులే ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన నావికుల్ని ఒమన్ అధికారుల సహాయంతో నౌక నుంచి తరలించి ఖసబ్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. నౌకలో 17 మంది భారతీయులతో సహా మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు.

వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. భారతీయ నావికుల్ని తరలించడానికి సహకరించిన ఒమన్ అధికారులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ థాంక్స్ తెలిపింది. హార్ముజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై కొనసాగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో నౌక ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఈ దాడుల్ని తక్షణమే నిలిపేయాలని పిలుపునిచ్చింది.

హార్ముజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయి. అక్టోబర్ మొదటి వారంలోనే 7 ట్యాంకర్లు దాడులకు గురయ్యాయి. ఇరాన్-అమెరికా శాంతి చర్చలు విఫలమైన తర్వాత, అమెరికా జలసంధిని దిగ్బంధించిన నేపథ్యంలో నౌకలపై దాడులు పెరిగాయి. జూలైలో ఒమన్ ప్రాదేశిక జలాల్లో యూఏఈకి చెందిన రెండు నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు భారతీయ సిబ్బంది మరణించగా, 10 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 23న మరో దాడివలో మరో భారతీయ నావికుడు మరణించారు.