Site icon NTV Telugu

Amarnath Yatra: నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర.. భారీ వర్షాలతో ఆగిన యాత్ర

Amarnath Yatra

Amarnath Yatra

Amarnath Yatra: అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల యాత్ర మధ్యలోనే నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రను ఆపివేసినట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు ఉత్తర భారత దేశాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర.. మధ్యలోనే ఆగిపోయింది. ప్రతికూల వాతావరణం ఉండటంతో అధికారులు.. అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. ఈ కారణంగా అమర్‌నాథ్ ఆలయానికి వెళ్తున్న వేలాదిమంది భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీగానే ఉన్నట్లు చెబుతున్నారు.

Read also: Hair Loss: మందు, సిగరెట్ తాగితే జుట్టు రాలుతుందా..ఈ అలవాటు వల్ల బట్టతల వస్తుందా?

జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు వరుసగా రెండో రోజు కూడా అమర్‌నాథ్‌ యాత్రను ఆపేశారు. జమ్ము – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పహల్గాం, బల్తాల్‌ రెండు మార్గాల్లోనూ వెళ్లే అమర్‌నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. దీంతో మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు బయల్దేరిన వేలాది మంది భక్తులు బల్తాల్‌, నున్వాన్‌ బేస్‌, భగవతి నగర్‌ బేస్‌ క్యాంపుల్లోనే చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం కారణంగా పంచతర్ణి ప్రాంతంలో దాదాపు 1500 మంది యాత్రికులు ఉండిపోయినట్లు తెలిపారు. వీరిలో 200 మంది దాకా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు రాంబన్‌ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ – శ్రీనగర్‌ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఆ క్రమంలోనే అమర్‌నాథ్‌ యాత్రను కొనసాగించడం సాధ్యం కాదని నిర్ణయించిన అధికారులు యాత్రను నిలిపివేసినట్లు చెప్పారు. దీంతో వెనకాల ఉన్న యాత్రికులు జమ్ము నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నట్లు తెలిపారు.

Read also: Jarkhand: దళిత బాలికల అపహరణ.. వారం రోజులుగా అత్యాచారం..

ఇప్పటికే యాత్ర మధ్యలో ఉన్నవారిని కూడా సమీపంలో ఉన్న బేస్‌ క్యాంప్‌ల్లోకి తరలించి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులను అడ్డుకున్నారు. అనంతరం వారిని ఎక్కడికక్కడ బేస్‌క్యాంప్‌లకు తరలించారు. అయితే ఈ ఉదయం కూడా వారిని యాత్ర కొనసాగించొద్దని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం యాత్రికులంతా షెల్టర్‌ స్టేషన్లలో సురక్షితంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు. ఈసారి జులై 1 న ప్రారంభమైన యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. 62 రోజుల పాటు జరిగే ఈ అమర్‌నాథ్‌ యాత్రలో భాగంగా హిమాలయ కొండల్లో నెలవైన మంచు శివలింగాన్ని దర్శించుకోవడం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు తరలి వస్తుంటారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లో 3,888 మీటర్ల ఎత్తులో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈ యాత్ర ప్రారంభమైన వారం రోజుల్లోనే 82 వేల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Exit mobile version