దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్‌తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఈ కొత్త రూపాంతరం ఆందోళన కలిగిస్తోందని, దీనిని మన దేశంలో నిరోధించడానికి చేయగలిగినదంతా చేయాలని పేర్కొన్నారు. ఈ చర్యలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఒమిక్రాన్ ప్రభావిత వ్యక్తి భారత దేశంలో ప్రవేశిస్తే, తీవ్ర హాని జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ గురించి అధికారులు ఆయనకు వివరించారు. మరో వైపు ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి.. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించాలని, వాటిని మరింత వేగవంతం చేయాలని కోరారు.
