Badruddin Ajmal: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో దీన్ని ఉద్దేశిస్తూ.. ముస్లింలు జనవరి 20 నుంచి 26 వరకు ఇళ్లల్లోనే ఉండాంటూ పిలుపునిచ్చారు. రామమందిర ప్రతిష్టాపన సమయంలో రైళ్లలో ప్రయాణించకూడదని కోరారు. ముస్లింలకు బీజేపీ శత్రువు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Read Also: S Jaishankar: ప్రపంచం మొత్తం భారతదేశం గురించి మాట్లాడుతోంది..
అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమాజంలో విభజన రేపేలా బద్రుద్దీన్ మాట్లాడుతున్నారంటూ విమర్శించింది. అజ్మల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిజార్ సింగ్ చౌహాన్ ఫైర్ అయ్యారు. బీజేపీ ముస్లింలను ద్వేషించదని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రంతో బీజేపీ పనిచేస్తోందని ఆయన అన్నారు. అయోధ్య భూ వివాదం కేసులో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారని, ఆయన వేడుకల్లో పాల్గొంటున్నారని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, బద్రుద్దీన్ అజ్మల్ వంటి వారు సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు.