Ram – Sita Statue: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అక్కడ ప్రతిష్టించే రాముడి విగ్రహం కోసం నేపాల్‌లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలలను తీసుకువస్తున్నారు. ఈ శాలిగ్రామ శిలలతో మాత్రమే రాముడి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. రెండు శాలిగ్రామ రాళ్లను ఎంపిక చేసి వాటిని ప్రత్యేక పూజలు నిర్వహించి తరలిస్తున్నారు. అవి అయోధ్యకు ఫిబ్రవరి 2న చేరుతాయి. ఈ శిలలు దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం నాటివని నిపుణులు చెప్తున్నారు. అయితే వీటితో తయారుచేసే విగ్రహాలను అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారా? లేక మరో ప్రాంగణానికి తరలిస్తారా? అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ రెండు శాలిగ్రామ శిలల బరువు 127 క్వింటాళ్లు. నెలల తరబడి వెతికితే గానీ ఈ శాలిగ్రామ శిలలు దొరికాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు శాలిగ్రామ శిలలు రెండు రోజుల క్రితం నేపాల్‌లోని పోఖారా సమీపంలోని గండకీ నది నుంచి క్రేన్ సహాయంతో రెండు పెద్ద ట్రక్కుల్లో తరలిస్తున్నారు. శాలిగ్రామ శిలలు కేవలం శాలిగ్రామి నదిలోనే దొరుకుతాయి. ఈ నది దామోదర్ కుండ్ నుంచి పుట్టి బిహార్‌లోని సోనేపూర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
Read Also: America Chaina War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధం
జనవరి 26న ఈ భారీ శిలలను ట్రక్కుల్లో ఎక్కించారు. పూజల అనంతరం వీటిని రోడ్డు మార్గంలో అయోధ్యకు తరలిస్తున్నారు. ఇవి అయోధ్యకు చేరుకోవాలంటే నాలుగు రోజుల సమయం పడుతుంది. దారిలో ఈ శిలలను చూసేందుకు, స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. రెండు భారీ శిలల్లో ఒకదాని బరువు 26 టన్నులు కాగా, మరొకటి 14 టన్నులు. ఈ శిలలు శనివారం జనక్‌పూర్‌కు చేరుకున్నాయి. ఇక్కడ రెండు రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం జనవరి 30న ఉదయం 8.30గంటలకు బీహార్‌లోని మధుబని జిల్లా సరిహద్దు నుండి శాలిగ్రామ శిలలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. అనంతరం వీటిని బిహార్ మధుబనిలోని సహర్‌ఘాట్, బేనిపట్టి మీదుగా దర్భంగా, ముజఫర్‌పూర్‌కు చేర్చుతారు. బిహార్‌లోని 51 ప్రదేశాల్లో ఈ శిలలకు పూజలు జరుగనున్నాయి. జనవరి 31న గోపాల్‌గంజ్ మీదుగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. 31న మధ్యాహ్నం 2గంటలకు గోరఖ్ పూర్ గోరక్ష పీఠానికి చేరుకుంటాయి. సీఎం యోగి ఆధిత్యనాథ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
అక్కడి నుంచి ఫిబ్రవరి 2న ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకుంటాయి. ఈ శాలిగ్రామ శిలలు భారత్ భూభాగంలోకి ప్రవేశించిన సమయం నుంచి అయోధ్య వరకు సాధువులు, ఋషులు, మహంతులు, విశ్వహిందూ పరిషత్ వారు ప్రత్యేక పూజల ద్వారా తరలిస్తారు. ఇదిలాఉంటే నేపాల్ సరిహద్దు వరకు శాలిగ్రామ శిలలు తరలించే సమయంలో నేపాల్ హోంమంత్రి, స్వయంగా ప్రధానితో పాటు 25మంది ప్రముఖులు రానున్నారు. ఆ తర్వాత ఇండియాలో కూడా వారి ప్రయాణం సాగుతుందని సమాచారం.