Sumalatha Ambareesh joining BJP: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజకీయ నాయకురాలిగా మారిన ప్రముఖ నటి, మాండ్యా లోక్‌సభ ఎంపీ సుమలత అంబరీష్.. అధికార బీజేపీలో చేరవచ్చనే ప్రచారం సాగుతోంది.. శుక్రవారం మండ్యలో జరిగే ప్రెస్ మీట్‌లో స్వతంత్ర ఎంపీ సుమలత బీజేపీలో చేరే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరె వద్ద బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి, అక్కడ మెగా బహిరంగ సభలో ప్రసంగించేందుకు మార్చి 12న ప్రధాని నరేంద్ర మోడీ మాండ్యాకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోనుందట.. మాండ్యాలో 1.5 కి.మీ మేర జరిగే రోడ్‌షోలో కూడా ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ వ్యవహారంపై స్పందించారు.. చర్చలు కొనసాగుతున్నాయని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు.
Read Also: MLA Jagga Reddy : ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్‌లను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలి
కాగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న సుమలత.. మంచి పేరు తెచ్చుకున్నారు.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. 2019 సాధారణ ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై ఏకంగా 1.25లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు సుమలత.. దీంతో.. ఒక్కసారిగా మాండ్య వైపు అందరి దృష్టి మళ్లింది.. అయితే, సుమలత భర్త, అంబరీశ్ గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఇక, గత ఎన్నికల్లో సుమలత కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించినా.. అది సాధ్యపడలేదు.. దీంతో.. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విక్టరీ కొట్టారు.. ఇప్పుడు బీజేపీ చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సుమలత బీజేపీలో చేరడంపై ఎలాంటి వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి యాద్‌గిర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, “మీరు చాలా కాలం వేచి ఉన్నారు, మరో 24 గంటలు వేచి ఉండండి. నేను ధృవీకరించలేను లేదా తిరస్కరించలేను, నాకు తెలియనిది.” ప్రతి వ్యక్తికి తనదైన బలం ఉందని, ఎవరైనా పార్టీలో చేరడం ద్వారా వారి నియోజకవర్గాల్లో అది ఖచ్చితంగా బలపడుతుందని అన్నారు.. అయితే, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమలతకు మద్దతుగా కాంగ్రెస్ జెండాతో బహిరంగంగా ప్రచారం చేశారు. మాండ్య జిల్లా JD(S) కంచుకోట మరియు 2018 ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దాని బద్ధ ప్రత్యర్థి కాంగ్రెస్ ఇక్కడ చాలా బలంగా ఉంది, అయితే బీజేపీ బలహీనంగా ఉందని చెబుతారు. దీంతో.. ఎలాగైనా సుమలతను పార్టీలో చేర్చుకుంటే.. బీజేపీకి మరింత కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారట.