NTV Telugu Site icon

Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని బండా జైలులో గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మృతికి ‘విషప్రయోగం’ కారణమని కుటుంబ సభ్యులతో పాటు అతని కొడుకు ఆరోపించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మాత్రం అతను గుండెపోటుతో మరణించినట్లు నిర్థారణ అయింది. ఇదిలా ఉంటే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం అన్సారీ ఇంటికి వెళ్లారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా మొహమ్మదాబాద్ పట్టణంలోని అన్సారీ ఇంటికి వెళ్లిన అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మార్చి 28న ముఖ్తార్ అన్సారీ మరణించారు. అన్సారీ మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేసిన కొన్ని రోజుల తర్వాత అఖిలేష్ యాదవ్ అతని ఇంటికి వెళ్లడం గమనార్హం.

Read Also: Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

దీనికి ముందు అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీ మాట్లాడుతూ.. ముఖ్తార్ అన్సారీకి మార్చి 19 భోజనంలో విషం ఇచ్చారని, అదే విషయాన్ని కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అన్సారీ మరణం తర్వాత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘ ప్రతీ పరిస్థితిలో , ప్రతీ ప్రదేశంలో ఒకరి ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత, కర్తవ్యం’’ అని అన్నారు. బండా జైలులో ఒక ఖైదీ మరణించడం న్యాయ ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా చేస్తుందని, ఇలాంటి సందేహాస్పద కేసులన్నింటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారించాలని అన్నారు.

ఇదిలా ఉంటే, అఖిలేష్ యాదవ్ వచ్చి మమ్మల్ని కలవడం, మా ఆత్మగౌరవాన్ని పెంచిందని ముఖ్తాన్ అన్సారీ కొడుకు ఉమర్ అన్సారీ అన్నారు. మా నాన్నతో నాకున్న అనుబంధం వేరు, కానీ లక్షలాది మందితో మా నాన్నను మెస్సయ్యాగా చూశారని అన్నారు. అఖిలేష్ యాదవ్ రావడం తమ ఫ్యామిలీకి మాత్రమే కాదని, మా నాన్న అనుచరులకు కూడా ధైర్యాన్ని ఇచ్చిందని ఉమర్ అన్సారీ అన్నారు. ముస్లింలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, మేము పోరాడుతామని చెప్పారు.