జెన్‌జెడ్ నిరసనకారులపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. యువతే నటులను స్టార్లుగా నిలబెడుతుందని, సమాజంలో ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ప్రజల మద్దతు ఎంతో ముఖ్యమని అన్నారు. కంగనా నిజంగానే జెన్‌జెడ్‌ను ‘‘జనరేషన్ గటర్’’ అని పిలిచి ఉంటే అది చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
మీడియాతో మాట్లాడిన సోనూ సూద్.. తొలుత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను తాను వినలేదని చెప్పారు. అయితే యువత పాత్ర, ప్రజల మద్దతు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ యువతే నటులను స్టార్లుగా చేస్తారు. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చేది కూడా వారే. వారు మీతో ఉన్నంత కాలం మీరు ఎదుగుతారు. వారు మీకు దూరమైతే ముందుకు సాగడం కష్టమవుతుంది. అందరినీ కలుపుకుని వెళ్లాలి.’’ అని అన్నారు. వృత్తి ఏదైనా ప్రజలతో అనుబంధం ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ‘‘మీరు నటుడు కావచ్చు, వైద్యుడు కావచ్చు లేదా మరే వృత్తిలో ఉన్నా.. ప్రజలు మీతో అనుసంధానమై ఉన్నంత వరకు మాత్రమే ఈ సమాజంలో మీ ఉనికికి అర్థం ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.
అయితే కంగనా రనౌత్ జెన్‌జెడ్ యువతను ‘‘గటర్’’ అంటూ వ్యాఖ్యానించారని మీడియా ప్రతినిధులు మరోసారి చెప్పడంతో సోనూ సూద్ స్పందించారు. ‘‘ఆమె నిజంగానే అలా చెప్పి ఉంటే అది చాలా సిగ్గుచేటు. అలాంటి మాటలు మాట్లాడకూడదు.’’ అని అన్నారు. మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరమని సూచించారు. ‘‘‘తోల్ మోల్ కే బోల్’ అని ఒక సామెత ఉంది. అంటే మాట్లాడే ముందు మాటలను బేరీజు వేసుకోవాలని అర్థం. ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలు దేవుడి మరో రూపం.’’ అని పేర్కొన్నారు.
కంగనా రనౌత్ ఏమన్నారు?
జెన్‌జెడ్ నిరసనకారులపై కంగనా రనౌత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ వివాదం మొదలైంది. జంతర్‌మంతర్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న యువత ఉపయోగించిన భాషపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు, రీల్స్ చూడటానికి అసహ్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘నా జీవితంలో ఒకే చోట ఇంతటి అసహ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్‌జెడ్ నిరసనలకు సంబంధించిన రీల్స్ చూస్తే వాంతి వచ్చినట్లుగా అనిపిస్తోంది. వారు మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష చాలా అసభ్యంగా ఉంది.’’ అని కంగనా పేర్కొన్నారు. అంతేకాకుండా జెన్‌జెడ్ యువత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మాదకద్రవ్యాలు, మద్యం తీసుకునే స్వేచ్ఛను గొప్పగా చూపించుకుంటూ.. తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడి సిగ్గులేకుండా జీవిస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో జెన్‌జెడ్‌ను ‘‘జనరేషన్ గటర్’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. వారిలో కొందరు వ్యవస్థకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నారని, చదువులో కూడా రాణించలేరని ఆరోపించారు. కంగనా వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా సోనూ సూద్ స్పందనతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

