Sonia Gandhi Offers Prayers At Mysuru Temple: దసరా సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సోనియాగాంధీ మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న కాంగ్రెస్ జోడో యాత్రలో గురువారం పాల్గొనబోతున్నారు సోనియాగాంధీ. దీని కోసం ఆమె సోమవారమే కర్ణాటక చేరుకున్నారు. మైసూరులో ఓ ప్రైవేట్ రిసార్టులో ఆమె ఉన్నారు.
‘‘ ఈ రోజు హెచ్ డీ కోట్ అసెంబ్లీలోని బేగూర్ గ్రామంలోని భీమనకల్లి ఆలయంలో సోనియాగాంధీ దసరా ప్రత్యేక పూజలకు హాజరయ్యారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. దసరా సందర్భంగా రెండు రోజుల పాటు భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి గురువారం నుంచి మళ్లీ యాత్ర ప్రారంభం కానుంది.
Read Also: Fake Job Racket: నకిలీ జాబ్స్ మోసం.. మయన్మార్ నుంచి 13మంది ఇండియన్స్ సేఫ్
ప్రస్తుతం ‘ భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో సాగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయింది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ యాత్రకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. 21 రోజల పాటు 511 కిలోమీటర్ల మేర కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.
2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్రను ప్రారంభించింది కాంగ్రెస్. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర సాగుతుంది. 3750 కిలోమీటర్ల పాదయాత్ర జమ్మూ కాశ్మీర్ లో ముగియనుంది. ఐదు నెలల పాటు యాత్ర జరుగనుంది. మరోవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం ఈ పాదయాత్ర రాష్ట్రంలో అధికారాన్ని తీసుకువస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.