Legal Notice to Sonia Gandhi: సోనియా గాంధీ పుస్తకంపై మరో వివాదం.. సావర్కర్ మునిమనవడి సంచలన నిర్ణయం!

Sonia Gandhi

Sonia Gandhi

Legal Notice to Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆమె రచించిన ‘Belonging: A Journey of Love’ పుస్తకంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చరిత్రను వక్రీకరించేలా ఉన్నాయని ఆరోపిస్తూ సోనియా గాంధీకి లీగల్ నోటీసులు పంపించారు. 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దేశ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ రచించిన పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలు రాజకీయ, న్యాయపరమైన చర్చకు దారితీశాయి. స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి పుస్తకంలో ప్రస్తావించిన అంశాలపై ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోనియా గాంధీకి న్యాయవాది సంగ్రామ్ కొల్హట్కర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. సావర్కర్ జీవితాన్ని, ఆయన సిద్ధాంతాలను వక్రీకరించేలా పుస్తకంలో వ్యాఖ్యలు ఉన్నాయని నోటీసులో ఆరోపించారు. సోనియా గాంధీ రచించిన ‘Belonging: A Journey of Love’ పుస్తకాన్ని హార్పర్‌కోలిన్స్ పబ్లిషర్స్ ఇండియా ప్రచురించింది. నవంబర్ 10న ప్రచురితమైంది. ఈ పుస్తకంలోని 201, 443 పేజీల్లో సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై సత్యకి సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

201వ పేజీలోని వ్యాఖ్యలు

బ్రిటిష్ పాలకుల చేతిలో కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధులు దాడులు, జైలు శిక్షలు ఎదుర్కొంటున్న సమయంలో.. ఆర్ఎస్ఎస్ సీనియర్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటిష్ పాలకులకు క్షమాభిక్ష పిటిషన్లు రాశారని, ఆ సంస్థ సభ్యులు బ్రిటిష్ అధికారులతో సమాచారదారులుగా కలిసి పనిచేశారని పుస్తకంలో పేర్కొన్నట్లు నోటీసులో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యల ద్వారా సావర్కర్ బ్రిటిష్ అధికారులకు భారత స్వాతంత్ర్య సమరయోధుల గురించి సమాచారం అందించేవారిగా లేదా వారితో కలిసి పనిచేసిన వ్యక్తిగా పాఠకులకు తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని సత్యకి సావర్కర్ ఆరోపించారు.

443వ పేజీలోని వ్యాఖ్యలు

మహాత్మా గాంధీ సమకాలీనుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ ప్రతిపాదించిన హిందుత్వ సిద్ధాంతం ప్రకారం.. భారత్ ప్రధానంగా హిందువుల ఆధిపత్యం కలిగిన దేశంగా ఉండాలనే భావన ఉందని పుస్తకంలో పేర్కొన్నట్లు నోటీసు తెలిపింది. ఈ దృక్పథాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వాటి అనుబంధ సంస్థలు అనుసరిస్తున్నాయని కూడా ప్రస్తావించినట్లు వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు సావర్కర్ రాజకీయ, సైద్ధాంతిక భావజాలాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాయని సత్యకి సావర్కర్ అభ్యంతరం తెలిపారు.

అండమాన్ జైలులో సావర్కర్ అనుభవించిన కష్టాల ప్రస్తావన

సావర్కర్ మునిమనవడు పంపిన నోటీసులో ఆయన బ్రిటిష్ పాలనలో ఎదుర్కొన్న కష్టాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలులో ఆయన సుదీర్ఘకాలం కారాగార శిక్ష అనుభవించారని పేర్కొన్నారు.

జైలు జీవితంలో సావర్కర్ సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్లను మాత్రమే ప్రస్తావిస్తూ, వాటి వెనుక ఉన్న పరిస్థితులు, అప్పటి చారిత్రక నేపథ్యం, ఇతర పరిణామాలను వివరించకపోవడం వల్ల ఆయన జీవిత చరిత్ర అసంపూర్ణంగా, వక్రీకరించిన విధంగా కనిపిస్తోందని నోటీసులో ఆరోపించారు. అంతేకాకుండా, సావర్కర్ స్వాతంత్ర్య పోరాటం, రాజకీయ కార్యకలాపాలను సరైన చారిత్రక సందర్భంలో విశ్లేషించాలని సూచించారు.

సోనియా గాంధీకి 15 రోజుల గడువు

సత్యకి సావర్కర్ పంపిన లీగల్ నోటీసులో సోనియా గాంధీకి మూడు ప్రధాన డిమాండ్లు చేశారు.
సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
వివాదాస్పద వ్యాఖ్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి.
పుస్తకంలోని తప్పుగా పేర్కొన్న అంశాలను సరిదిద్దాలి.

నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా ఈ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో సంబంధిత న్యాయస్థానం లేదా అధికార సంస్థను ఆశ్రయించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోనియా గాంధీ పుస్తకంలోని సావర్కర్ ప్రస్తావనలపై గతంలోనూ రాజకీయ వివాదం చెలరేగింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నాయకులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనలో భాగంగా కొందరు నాయకులు పుస్తకంలోని పేజీలను చించివేసి, వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. తాజాగా సావర్కర్ మునిమనవడు లీగల్ నోటీసులు పంపించడంతో ఈ వివాదం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ నోటీసులపై సోనియా గాంధీ లేదా ఆమె తరఫున అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.