గతేడాది మే నెలలో హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాళ్లపారాణి ఆరకముందే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది ఇల్లాలు. అయితే ఈ కేసులో ఇటీవల ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. దీంతో బాధిత కుటుంబంతో పాటు యావత్తు దేశం అవాక్కైంది. ఇంత సీరియస్ కేసులో నిందితురాలికి బెయిల్ ఎలా వచ్చిందని నిశ్చేష్టులయ్యారు.
దీంతో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలంటూ బాధిత కుటుంబం షిల్లాంగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఇరువర్గాలు వాదనలు వినిపించారు. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. ఇప్పుడు తదుపరి విచారణపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. బెయిల్ రద్దవుతుందా? లేదంటే కొనసాగిస్తుందా? అన్నది సస్పెన్ష్‌గా ఉంది.
సోనమ్ రఘువంశీ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సంజీవ్ చందా వాదనలు వినిపించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గురువారం డిఫెన్స్ తమ వాదనలను వినిపించిందని తెలిపారు. వారి వాదనలపై కోర్టులో వివరంగా చర్చ జరిగిందని.. విచారణ చాలాసేపు కొనసాగిందని అన్నారు. అయితే వాదనలు పూర్తి కాలేదని.. విచారణను శుక్రవారం వరకు కొనసాగించాలని కోర్టు నిర్ణయించిందని చెప్పారు. తదుపరి విచారణలో డిఫెన్స్ తమ మిగిలిన వాదనలను వినిపిస్తుందని పేర్కొన్నారు.
సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందా అని అడగ్గా.. సూటిగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. రాబోయే ఏ నిర్ణయంపైనా వ్యాఖ్యానించడం తగదని పేర్కొన్నారు. ప్రతి విచారణతో ఉత్సుకత పెరుగుతుండటంతో.. ఈ కేసు గణనీయమైన ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. గురువారం నాటి విచారణ తర్వాత.. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం నాటి విచారణపైనే కేంద్రీకృతమై ఉంది.
తదుపరి విచారణపై అందరి దృష్టి
న్యాయ నిపుణుల ప్రకారం.. శుక్రవారం నాడు ప్రతివాద పక్షం తమ వాదనలను పూర్తి చేస్తుంది. దీని తర్వాత బెయిల్ పిటిషన్‌పై తదుపరి కార్యాచరణను కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే తుది నిర్ణయం ఏమిటనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక సూచన రాలేదు. ప్రస్తుతం అందరి దృష్టి షిల్లాంగ్ కోర్టులో జరుగుతున్న విచారణపైనే ఉంది. ఈ కేసులో శుక్రవారం నాటి విచారణ కీలకమైనదిగా భావిస్తున్నారు.
గతేడాది మే 11న రాజా రఘువంశీ-సోనమ్ రఘువంశీకి వివాహమైంది. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. విహార యాత్ర పేరుతో భర్తను నమ్మించి.. ప్రియుడితో కలిసి భర్తను సోనమ్ చంపేసింది. ఈ ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. తొలుత రాజా మృతదేహం లభించగా.. కొద్దిరోజుల తర్వాత సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఏడాది తర్వాత బెయిల్ లభించడంతో బాధిత కుటుంబం షాక్‌కు గురైంది.
