Snake In Train: ఇటీవల కాలంలో టర్కీకి చెందిన ఓ విమాన సంస్థ ఆహారంలో పాము తలకాయ వచ్చిందనే వార్తలు చూశాం. ఈ వార్త తెగ వైరల్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన ఇండియాలో ఓ పాము రైల్ లో దూరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా.. పాము కనిపించకపోవడంతో బిక్కుబిక్కు మంటూ ప్రయాణం చేయాల్సి వచ్చింది.
ఈ ఘటన కేరళ రాష్ట్రం కోజికోడ్ లో జరిగింది. తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ పాము దూరిందని ప్రయాణికులు గుర్తించారు. సమాచారాన్ని రైల్వే అధికారులకు ఇవ్వడంతో గంటకు పైగా రైలును నిలిపివేసి.. పాము కోసం వెతికారు. అయితే అప్పటికీ పామును గుర్తించలేకపోయారు. బుధవారం రాత్రి తిరుర్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైలులోని 55 కంపార్ట్‌మెంట్‌లోని లోయర్ బెర్త్ కింద సామాను మధ్య పాము ఉన్నట్లు ప్రయాణీకులు టీసీకి సమాచారం అందించారు. వెంటనే కోజికోడ్ రైల్వే స్టేషన్ లో గంట సేపు రైలును నిలిపివేసి మొత్తం కంపార్ట్‌మెంట్ వెతికారు.
Read Also: Snake Head Found In Plane Meal: విమాన భోజనంలో పాము తల.. వీడియో వైరల్
గంట పాటు రైలును నిలిపివేయడంతో.. ఏం జరిగిందో మొదట ప్రయాణికులకు తెలియలేదు.. ఆ తరువాత కంపార్ట్‌మెంట్‌లో పాము ఉందనే వార్తలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోజికోడ్ రైల్వే అధికారులు, పామును గుర్తించేందుకు అటవీశాఖ నిపుణులను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ సిబ్బంది, ఇద్దరు పాములను పట్టే వ్యక్తులు.. కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులను దించేసి వెతికినా లాభం లేకుండా పోయింది. రాత్రి 10.15 గంటల వరకు పాము కోసం వెతికారు. కాగా.. రైలు బోగీలోని రంధ్రం గుండా పాము తప్పించుకుని ఉండవచ్చని.. లేకపోతే అందులోనే దాక్కుని ఉండవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి. రంధ్రాన్ని మూసేసిన తర్వాత రైలు తిరిగి ప్రారంభం అయింది.