Site icon NTV Telugu

Snake-bite scam: ‘‘పాముకాటు కుంభకోణం’’.. 47 మందిని 280 సార్లు చంపారు..

Snake Bite Scam

Snake Bite Scam

Snake-bite scam: మధ్యప్రదేశ్ లో ‘‘పాము కాటు కుంభకోణం’’ వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో 47 మంది మరణిస్తే, ఏకంగా 280 సార్లు మరణించారని ప్రకటించారు. ప్రతీసారి రూ. 4 లక్షలను ప్రకృతి వైపరీత్య సహాయాన్ని పొందారు. ఫలితంగా మొత్తం రూ. 11 కోట్ల 26 లక్షల అవినీతి జరిగింది. రెవెన్యూ అండ్ అకౌంట్స్ విభాగం దర్యాప్తులో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 37 మందిని నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితుడితో సహా 20 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ఈ స్కామ్ గురించి పరిశీలిస్తే, ఉదాహరణకు ద్వారకా బాయి అనే మహిళ పాముకాటులో మరణించింది, ఆమె పేరుతో అధికారులు 29 సార్లు చనిపోయినట్లు ప్రకటించారు. ప్రతీసారి ఈమె పేరుతో రూ. 4 లక్షల సహాయ మొత్తాన్ని రాబట్టారు. ఇలా ఈ ఒక్క మహిళ పేరు మీదనే రూ. 1 కోటి 16 లక్షలు మోసం చేశారు. ఇలాగే శ్రీరామ్ అనే వ్యక్తి విషయంలో, ఆయన 28 సార్లు మరణించినట్లు ఫేక్ ఆధారాలు సమర్పించారు.

Read Also: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేసు.. ఆమెకు స్పాన్సర్ చేసిన సంస్థతో అజర్ బైజాన్‌ ఒప్పందం..

ఇలా ఈ నిధుల దుర్వినియోగం 2019-2022లో జరిగాయి. నవంబర్ 2022లో రెవెన్యూ ఆడిట్‌లో సంఘటన వెలుగులోకి వచ్చింది. పాము కాటు, నీటిలో మునిగి మరణించడం వంటి సంఘటనలకు గానూ సహాయ మొత్తాన్ని అందిస్తారు. దర్యాప్తు తర్వాత, రూ. 11 కోట్ల 26 లక్షలు దుర్వినియోగం అయినట్లు, 47 మంది ఖాతాలకు ట్రాన్స్ ఫర్ అయినట్లు కనుగొన్నామని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారి రోహిత్ సింగ్ కౌశల్ చెప్పారు. అయితే, నకిలీ పత్రాలను ఉపయోగించి ఎవరి పేర్లపై ఈ మొత్తాలు పొందారు, వారు నిజంగా బతికి ఉన్నారా..? చనిపోయారా..? అనే విషయం కూడా తెలియదని, చాలా సార్లు అడిగినప్పటికీ పోస్టుమార్టం నివేదికలు, డెత్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సియోని కలెక్టర్‌కి నివేదిక పంపినట్లు చెప్పారు.

కియోలారి తహసీల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేసే సచిన్ దహాయత్ ఈ మొత్తం స్కామ్‌లో కీలక నిందితుడని తెలిసింది. పాము కాటు, నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు వల్ల మరణించిన వారి సంఖ్యను చూపించి 280 మంది పేరిట మంజూరు చేసిన మొత్తాన్ని అతను తన బంధువులు, పరిచయస్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడిని సర్వీసు నుంచి తొలగించారు. ఈ కేసులో పలువురు తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలని నివేదిక సిఫారసు చేసింది.

Exit mobile version