ప్రధానికి స్వాగతం పలికే ప్రోటోకాల్‌ను కూడా పాటించని నేత సీఎం కేసీఆర్ అని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ రాగా, ఆయనకు స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శనాత్మకంగా స్పందించారు. ప్రధాని వస్తే స్వాగతించడానికి రాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఓ నియంత అని అభివర్ణించారు.
కేసీఆర్ కుటుంబానికి రాజకీయాలంటే సర్కస్ కావచ్చని.. తమకు మాత్రం బాధ్యతన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు ప్రజలు ఆమోదం తెలపరని చెప్పారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ అనుసరించదని ఆమె వెల్లడించారు. అవినీతి, కుటుంబ పాలనకు మారుపేరు టీఆర్ఎస్ అని స్మృతి ఇరానీ విమర్శించారు. రాజ్యాంగ గౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా వారు నియంతే అవుతారని.. ఆ లెక్కన కేసీఆర్ కూడా నియంతే అని స్మృతి పేర్కొన్నారు. అంతేకాదు కేసీఆర్ రాజ్యాంగపరమైన సంప్రదాయాలనే కాకుండా, సాంస్కృతికపరమైన సంప్రదాయాలను కూడా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.
BJP V/s TRS: ముచ్చటగా మూడోసారి.. ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ గైర్హాజరు
పేదల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని ఆమె అన్నారు. రెండు కళ్ల విధానం బీజేపీలో చెల్లుబాటు కాదన్నారు. బీజేపీ పాలనలో 8 ఏళ్లలో దేశం ఎంతో లబ్ది పొందిందని, 11 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు అందాయని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు అద్భుతమని కొనియాడారు.