Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకు ఓ ట్విస్ట్ ఎదురవుతోంది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ హత్యకు ప్లాన్ చేసి చంపారు. పూణేకు సమీపంలోని లోహ్‌గఢ్ పోర్టుపై నుంచి తోసి హత్య చేశారు. అయితే, ఈ కేసులో సియా, చేతన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సియా సంచలన విషయం వెల్లడించినట్లు తెలిసింది. చేతన్‌తో తనకు ప్రేమ సంబంధం ఉన్నట్లు అంగీకరించింది.
అయితే, చేతన్‌తో లవ్ ఎఫైర్ గురించి కేతన్‌కు చెప్పినట్లు సియా వెల్లడించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినప్పటికీ.. ‘‘తన కుటుంబం ప్రభావవంతమైంది, సంపన్నమైంది. నువ్వు ఈ పెళ్లి నుంచి తప్పించుకోలేవు. పారిపోయినా ప్రయోజనం ఉండదు’’ అని కేతన్ బెదిరించినట్లు చెప్పినట్లు సమాచారం. అయితే, సియా ఆరోపణలపై నిజానిజాలను అధికారులు తేల్చాల్సి ఉంది.
ఈ కేసులో హత్యకు ప్లాన్ పూణేలోని ఒక కేఫ్ నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. హత్యకు ముందు కూడా సియా, చేతన్ కలిసి గంటల కొద్ది మాట్లాడుకున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. గత ఏడు నెలల కాలంలో వీరిద్దరి మధ్య ఏకంగా 2004 కాల్స్, 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరి మధ్య ప్రేమ 2025 నవంబర్‌లో ప్రారంభమైనట్లు తెలిసింది.
ఇదే కాకుండా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరాన్ని నెట్టేసుకునే ప్రయత్నం చేసినట్లు తేలింది. మొదట ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, కానీ కుటుంబ పరువు దృష్ట్యా సియా వెనక్కి తగ్గినట్లు చేతన్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.మరోవైపు, హత్య ఆలోచన చేతన్‌దే అని సియా పోలీసులకు చెప్పింది.

