కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ అక్క.. రక్తం పంచుకుని పుట్టిన సోదరుడికి మరణశాసనం రాసింది. వ్యాధి బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని సోదరుడిని కాటికి పంపించింది సోదరి. చిత్రదుర్గ జిల్లా హోళల్కెరె తాలూకాలో ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Honor killing: మరో పరువు హత్య.. ఎస్ఐ కూతురుతో ప్రేమ.. చంపేయాలని కొడుకుతో చెప్పిన తల్లిదండ్రులు
హోళల్కెరె తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు(23) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యువకుడి సోదరి, బావ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. విషయం తెలియగానే సోదరి అవమానంగా భావించింది. విషయం గ్రామంలో తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భయాందోళన చెందింది.
ఇది కూడా చదవండి: Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష రద్దు!.. గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ధృవీకరణ
అంతే జూలై 25న సోదరుడికి ఎయిడ్స్ ఉందని తెలియగానే.. భర్త సాయంతో బురఖాను ఉపయోగించి గొంతుకోసి చంపేసింది. సోదరుడికి బెంగళూరులో వైద్యం చేయించే నెపంతో ఆస్పత్రి నుంచి బయటకు తీసుకెళ్లి హతమార్చింది. ఇక మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకొచ్చినప్పుడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడని గ్రామస్తుల్ని నమ్మించింది. కానీ గ్రామస్తుల్లో కొందరు మెడ భాగంలో గాయాలు ఉన్నట్లు గమనించిడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకోగా.. నేరాన్ని అంగీకరించింది. సోదరుడి రోగం సమాజానికి తెలిస్తే.. కుటుంబ పరువు పోతుందని తన భర్తతో కలిసి చంపేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేయగా… భర్త పరారీలో ఉన్నాడు.
కుటుంబ పరువు కోసమే సోదరుడిని అక్క చంపేసిందని పోలీసులు తెలిపారు. మహిళను అరెస్టు చేశామని, ఆమె భర్తను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతను ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. సోదరుడికి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే కుటుంబం సిగ్గుపడుతుందని, అలాగే బంధువులు, గ్రామస్తులు బహిష్కరిస్తారేమోనని భయపడిందని పోలీసులు తెలిపారు. బీపీ, షుగర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఆమె ఆందోళన చెందినట్లుగా వెల్లడించారు. అయితే సోదరుడు అప్పుల్లో ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ముందు అబద్ధం చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు.
