NTV Telugu Site icon

Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య

Sidhu Moose Wala

Sidhu Moose Wala

ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ.. రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకి తావిస్తోంది.

కాగా.. సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ! తుపాకులు, గ్యాంగ్‌స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి ఇతని పాటల్లో ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇతను వివాదాస్పద గాయకుడిగా గతంలో వార్తల్లో నిలిచాడు. ఇతను పాడిన బింబిహ బోలే, 47 పాటలు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి సినిమాల్లో నటించిన ఇతనిపై.. 2020లో లాక్డౌన్ విధించినప్పుడు ఫైరింగ్ రేంజ్‌లో ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు కేసు నమోదైంది. గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధూ.. తాజా ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆప్ అభ్యర్థి డా. డిజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు.

గత నెలలో సిద్ధూ రిలీజ్ చేసిన ‘స్కేప్‌గోట్’ పాటలో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్దతుదారుల్ని టార్గెట్ చేశాడు. అందులో ఆప్ సపోర్టర్స్‌ని ‘ద్రోహులు’గా పేర్కొన్నాడు. ఆ పాట తీవ్ర దుమారం రేపింది. ఆప్ వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. సిద్ధూ హత్యపై రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రతిభావంతుడైన సిద్ధూ హత్య విషయం తెలిసి తాను తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యానని అన్నారు. అటు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.