NTV Telugu Site icon

Delhi: రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలు.. సోనియా ఇంటి దగ్గర సిక్కులు ఆందోళన

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ సిక్కులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ వైపు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఇంకోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మాత్రం మద్దతు తెలిపాడు. మొత్తానికి రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో దేశ రాజధాని ఢిల్లీలో సిక్కులు ఆందోళనకు దిగారు. సోనియాగాంధీ ఇంటి దగ్గర నిరసనలకు పూనుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్ ఏమన్నారంటే..
భారత్‌లో సిక్కులకు భద్రత లేదన్నారు. సిక్కులు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను సిక్కు సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. సిక్కులను అవమానించేలా ఉన్నాయని.. ఇలా మాట్లాడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ తక్షణమే సిక్కులకు క్షమాపణ చెప్పాలని సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ ఖండన.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మండిపడ్డారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాండ జరిగిన విషయం రాహుల్ గాంధీకి గుర్తులేదా..? అని ప్రశ్నించారు. 1984 అల్లర్లలో 3000 మంది మరణించారని… తన స్నేహితులు చాలా మంది తలపాగాలను తొలగించారన్నారు. దాడికి భయపడి క్లీన్ షేవ్ చేసుకున్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

 

Show comments