దేశంలో మళ్లీ ఖలిస్తానీ ఉగ్రవాదం మొదలవుతుందా… ? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఈ అనుమానం రాక మానదు. ఇటీవల కాలంలో పలు సంఘటనలు జరిగిన తీరును గమనిస్తే మరోసారి సిక్కు వేర్పాటువాద ఖలిస్తానీ ఉగ్రవాదులు యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సిక్ ఫర్ జస్టిస్ (ఎసఎఫ్ జే) సంస్థ విదేశాల నుంచి భారత్ లో తన కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా ఇటీవల పంజాబ్ మోహాలీలో ఇంటిజెన్స్ హెడ్ క్వార్టర్ పై రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రానెడ్( ఆర్పీజీ)తో దాడి చేశారు. ఈదాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీని తర్వాత హిమచల్ ప్రదేశ్ విధాన సభ ముందు ఖలిస్తానీ జెండాను ఎగరవేయడంతో పాటు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కు వార్నింగ్ ఇవ్వడంపై సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ బాధ్యత వహించాడు. ఈ రెండు ఘటనలకు తామే కారణం అంటూ ఓ ఆడియో మెసేజ్ ను పంపించాడు.
మోహాలీ ఆర్పీజీ గ్రానెడ్ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోండి… లేకపోతే సిమ్లాలో కూడా ఇలాంటి ఘటనే జరుగుతుందని.. సిక్కులను రెచ్చగొట్టవద్దని హిమాచల్ ప్రదేశ్ సీఎంకు గురుపత్వంత్ సింగ్ పన్నూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో రైతు ఉద్యమంలో కూడా ఖలిస్తానీ వేర్పాటవాద గ్రూప్ ఆనవాళ్లు కనిపించాయి. పంజాబ్ ఎన్నికల ముందు ప్రధాని కాన్వాయ్ ను రైతులు ఆపేయడం, సెక్యురిటీ వైఫల్యం సమయంలో కూడా తమ పాత్ర ఉన్నట్లు సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ పన్నూ ప్రకటించారు.
కాగా తనకు వచ్చిన బెదిరింపులపై సీఎం జైరామ్ ఠాకూర్ స్పందించారు. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని అన్నారు… అయితే ఈ ఘటనలను పెద్దగా పట్టించుకోనని.. గురుపత్వంత్ సింగ్ పన్నూను సీరియస్ గా తీసుకోనని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ విధాన సభ ముందు ఖలిస్తానీ జెండాను ఎగరవేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.