NTV Telugu Site icon

Shri Krishna Janmabhoomi Case: షాహీ ఈద్గా తొలగింపు కేసుపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

Mathura Masjid

Mathura Masjid

దేశంలో ఓవైపు జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. వారణాసి కోర్ట్ తో పాటు సుప్రీం కోర్ట్ లోొ  కేసు విచారణ నడుస్తోంది. ఇటీవల వారణాసి కోర్ట్ ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇందులో భాగంగా మసీదులోని ‘వాజు ఖానా’లో బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ బయటపడిన శివలింగానికి రక్షణ ఇవ్వాలని వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను మే 20కి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే మరోవైపు మరోకొత్త వివాదం ప్రారంభం అయింది. ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా కేసును విచారించేందుకు మథుర కోర్ట్ నిర్ణయం తీసుకుంది. మథురలోని శ్రీ కృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న షాహీ ఈద్గాను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు మథుర కోర్ట్ అంగీకరించింది. కృష్ణుడి భక్తురాలు రంజనా అగ్నిహోత్రి రెండేళ్ల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుబంధంగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సుప్రీం కోర్ట్ తీర్పు,  ప్రార్థనా స్థలాల చట్టం 1991ని మథుర కోర్ట్ ఉల్లంఘించిందని, పార్లమెంట్ చట్టానికి ఇది వ్యతిరేఖం అని అసదుద్దీన్ అన్నారు. జ్ఞానవాపి అయినా, మథుర అయినా ముస్లిం సమాజంపై మరింత ద్వేషం, అభద్రతా, హిందు సోదరుల్లో అపనమ్మకం వంటి వాతావరణాన్ని సృష్టించి, దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లాలనే ఆలోచనలా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వీటన్నింటికి స్వస్తి పలకాలని… సమాజాన్ని విభజించే ఇటువంటి చర్యలను సమర్థించబోమని చెప్పాల్సిన సమయం వచ్చిందని అసదుద్దీన్ అన్నారు. గతంలో జ్ఞానవాపి సమయంలో కూడా అసదుద్దీన్ కీలక వ్యాక్యలు చేశారు. గతంలో బాబ్రీ మసీదును కోల్పోయామని… జ్ఞానవాపిని కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు.