NTV Telugu Site icon

Maharashtra: డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన షిండే.. ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..!

Mahayuti

Mahayuti

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్‌ల ‘మహాయుతి’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా , మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. మరోవైపు డిసెంబర్ 05న ముంబైలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం పదవిపై, తన ఇతర ఆశల్ని సాధించుకునేందుకు ఏక్‌నాథ్ షిండే కొద్దిగా బెట్టు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Rahul Gandhi: రేపు సంభాల్‌కి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు.. ఇటీవల మసీదు సర్వేలో హింస..

ప్రసుత్తం, ఆయన డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 05న ఫడ్నవీస్ సీఎంగా, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహాయుతి కూటమి భాగస్వాములైన శివసేన, బీజేపీ, ఎన్సీపీల మధ్య క్యాబినెట్ పదవులు, పోర్ట్‌ఫోలియోల కేటాయింపు ప్రమాణ స్వీకారం తర్వాత ఉంటుందనే సమాచారం ఉంది.

బీజేపీ హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలు దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్, శాసనమండలి చైర్మన్ పదవులను కూడా బీజేపీ దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక శివసేన 16 మంత్రిత్వ శాఖలను దక్కించుకోవాలని అనుకుంటోంది. పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన వద్ద ఉండగా, మండలి చైర్మన్ పదవిని శివసేన కోరుకుంటోంది. ఎన్సీపీ ఆర్థిక మంత్రి, డిప్యూటీ స్పీకర్‌తో సహా 9-10 మంత్రిత్వ శాఖలను స్వీకరించే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ వెల్లడించింది. డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఇతర ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు, ఈ వేడుకకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.

Show comments