Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీలో బరిలో దిగాలని శశిథరూర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళయాళ దిన పత్రిక “మాతృభూమి”లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల జరగాలని ఆయన చెప్పారు. అయితే తాను బరిలో నిలిచే విషయం ఇంకా స్పష్టం చేయలేదు. కానీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలని ఇటీవల పత్రికాముఖంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలతో పాటు సీడబ్ల్యూసీలోని 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి పార్టీ ప్రకటన చేసి ఉంటే బాగుండేదన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో గాంధీలు దూరంగా ఉంటామన్న నేపథ్యంలో పోటీ అనివార్యం కానుంది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఆసక్తి చూపే అవకాశం ఉందని శశిథరూర్ అన్నారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ కూడా ఈ రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. యూకేలోని అధికార కన్జర్వేటివవ్ పార్టీ నాయకుడి కోసం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కూడా ఎన్నిక జరిగితే భారత్ వ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని శశిథరూర్ అన్నారు.
ఎన్నికల వల్ల ఇతర ప్రయోజనకరమైన ప్రభావాలు కూడా ఉన్నాయని థరూర్ అన్నారు. ఉదాహరణకు బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో ప్రపంచవ్యాప్త ఆసక్తిని తాము చూశామన్నారు. థెరిసా మే స్థానంలో డజను మంది అభ్యర్థులు పోటీ చేసిన 2019లో బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచారని చెప్పుకొచ్చారు. ఇలాంటి దృష్టాంతాన్ని కాంగ్రెస్‌కు పునరావృతం చేయడం ఆ పార్టీ పట్ల జాతీయ ఆసక్తిని పెంచుతుందని, మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ మంది ఓటర్లను పెంచుతుందని ఆయన కథనంలో పేర్కొన్నారు.
Rains in Telangana : రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు.. యాదాద్రిలో అధికం..
2020లో పార్టీలో సంస్కరణలకు డిమాండ్ చేసిన జీ23 నేతల్లో శశి థరూర్ ఒకరు. అలా కాకుండా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా మారితే.. జీ23 గ్రూపు ప్రతినిధిగా శశి థరూర్ అతనిపై పోటీ చేయవచ్చు. హైకమాండ్ ప్రతినిధి గెలుపొందడం ఖాయమైనా.. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై పార్టీలోనే చర్చించేందుకు పోటీ తప్పదని వర్గం భావిస్తోంది. శశిథరూర్ అంగీకరించకపోతే మనీష్ తివారీ పోటీ చేయాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ పోటీ చేసినా తివారీ రంగంలోకి దిగవచ్చు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ గ్రూపు సభ్యుల్లో మాత్రం చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరగనుంది.
