NTV Telugu Site icon

S Jaishankar: SCO సమ్మిట్ కోసం పాకిస్తాన్ చేరిన జైశంకర్..

S Jaishankar

S Jaishankar

S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఓ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ వెళ్లడం ఇదే తొలిసారి.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంత గొప్పగా లేకున్నా.. ఎస్‌సీఓ సమావేశం కావడంతో భారత్ నుంచి జైశంకర్ పాకిస్తాన్ వెళ్లారు. తన పర్యటన గురించి ఇటీవల జైశంకర్ మాట్లాడుతూ.. నేను అనేక దేశాలకు చెందిన ఎస్‌సీఓ కార్యక్రమానికి వెళ్తున్నానని, భారత్-పాక్ సంబంధాల గురించి చర్చించడానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అయితే, పాక్ మీడియా మాత్రం జైశంకర్ రావడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.

Read Also: India-Canada Conflict: కెనడా ప్రధానిలో మొదలైన భయం.. భారత్-కెనడాల మధ్య వాణిజ్య బంధం దెబ్బతింటుందా..?

ఇదిలా ఉంటే, మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ, ఇతర అధికారులు రాజధాని ఇస్లామాబాద్-రావల్పిండిని పూర్తిగా లాక్‌డౌన్ చేశారు. సోమవారం నుంచి ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. వివిధ దేశాల నుంచి అధికారులు వస్తుండటంతో వారి భద్రతను నిర్ధారించడానికి ప్రజల రాకపోకల్ని పరిమితం చేసింది. అనేక వ్యాపారాలు, స్కూల్స్, మ్యారేజ్ హాల్స్‌ని మూసేశారు. ఇటీవల ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తా్న్, సింధ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇటీవల కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగడంతో ఇద్దరు చైనీయులు మరణించారు. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసింది.

ఎస్‌సీఓ‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, చైనా, రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్ స్థాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి.ఈ సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్, రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్, ఇరాన్ మొదటి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రెజా అరేఫ్ మరియు కిర్గిజ్స్తాన్, బెలారస్, కజకిస్తాన్, తజికిస్తాన్ మరియు మంగోలియా ప్రధానులు రాబోతున్నారు.