SC will hear plea to declare ‘Ram Setu’ national heritage monument: ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ.. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును లిస్టింగ్ చేయాలని స్వామి కోరగా… దాన్ని జస్టిస్ చంద్రచూడ్ దర్మాసనం ముందు ప్రస్తావించాలని సూచించారు. దీంతో సుబ్రమణ్య స్వామి ఈ విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించగా.. బెంచ్ లోని ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరుపుతామని.. ఈ అంశాన్ని విచారణ జాబితాలో చేరుస్తామని చెప్పారు. దీంతో ఈ కేసును చంద్రచూడ్ ధర్మాసనం విచారించబోతోంది. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్ లో ఉందని.. అత్యవసర విచారణ అవసరం అని సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టుకు విన్నవించారు.
రామసేతును జాతీయ ప్రాముఖ్యత కలిగిన పురాతన స్మారక చిహ్నంగా ప్రకటించాలని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ(ఎన్ఎంఏ)తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తిస్థాయి సర్వే జరిగేలా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Read Also: RRR – Shyam Singha Roy: ట్రిపుల్ఆర్, శ్యామ్ సింగరాయ్‌కి ఆస్కార్ ఆస్కారం ఉందా?
రామసేతు ఉనికిని కేంద్రం అంగీకరించిందని.. సేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలనే తమ డిమాండ్ తో 2017లో అప్పటి కేంద్రమంత్రి సమావేశానికి పిలిచారని.. ఆ తరువాత ఏం జరగలేదని స్వామి వెల్లడించారు. రామసేతు తమిళనాడు ఆగ్నేయ తీరాన్ని అనుకుని ఉన్న ఉన్న ఓ వంతెన లాంటి నిర్మాణం. రామాయణ కాలంలో రాముడు ఇక్కడ నుంచే శ్రీలంకకు వారధి నిర్మించారని చాలా మంది నమ్ముతుంటారు.
