NTV Telugu Site icon

Kolkata Doctor Case: ట్రైనీ వైద్యురాలి కేసులో సీబీఐ ఛార్జిషీట్ .. కీలక విషయం వెల్లడి..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌పై సామూహిక అత్యాచార ఆరోపణల్ని సీబీఐ కొట్టిపారేసింది. సంజయ్ రాయ్ అనే నిందితుడు వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. రెండు నెలల విచారణ తర్వాత సీబీఐ ఈ రోజు మధ్యాహ్నం సీల్దా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో రాయ్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఛార్జిషీట్ దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదు చేసింది.

Read Also: Eye Color Change : మీరు మీ కంటి రంగును మార్చవచ్చు.. కానీ.. ఈ చికిత్సలో సక్సెస్ రేట్ తక్కువే..!

ఆగస్టు 09న వైద్యురాలు చనిపోయినట్లు పరిశోధనలలో తేలింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో కోల్‌కతా పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. ఆగస్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ప్రభుత్వమే నిందితుడికి రక్షణగా నిలుస్తోందని ప్రజలు ఆరోపించారు.

ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో రాత్రి విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. మెడికల్ కాలేజీ సెమినార్ హాలులో సంజయ్ రాయ్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో మెడికల్ కాలేజ్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. బాధితురాలి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకపోగా, మృతదేహాన్ని చూసేందుకు మూడు గంటల పాటు అనుమతించలేదు. ఈ కేసులో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరుపై కూడా అనుమానాలు వచ్చాయి. అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను కూడా ఆర్థిక అవకతవకలు, సాక్ష్యాలను తారుమారు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరియు సీబీఐ అరెస్టు చేశాయి.