Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..

  • ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’..
  • సంజయ్ రౌత్ పోస్టుతో రాజకీయ విమర్శలు..
  • రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ, జేడీయూ ఫైర్..
Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: అల్బేనియా దేశంలో సుప్రీంకోర్టును ఆందోళనకారులు తగలబెట్టిన ఘటనపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ వివాదానికి కారణమైంది. ‘‘అల్బేనియా ప్రజలు సుప్రీంకోర్టును తగలబెట్టారు. సుప్రీంకోర్టు అవినీతిపరులైన ప్రధాన మంత్రులకు సహాయం చేస్తోందనే కోపంతో వారు ఈ పని చేశారు. నిరసన చేస్తున్న ప్రజలు పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మంత్రుల ఇళ్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల నుంచి అన్ని దేశాలు గుణపాఠాలు నేర్చుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పరోక్షంగా భారతదేశ సుప్రీంకోర్టును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

సంజయ్ రౌత్ చేసిన పోస్టుపై బీజేపీ, జేడీయూతో పాటు సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. శివసేన యూబీటీ నేత ప్రియాంకా చతుర్వేది సంజయ్ రౌత్‌పై విమర్శలు చేశారు. భారత్ మరే ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని, అల్బేనియా చిన్న దేశమని, అది చాలా కాలం కమ్యూనిస్టుల నియంతృత్వంలో గడిపిందని ప్రియాంకా చతుర్వేది అన్నారు. ఆమె హింసాత్మక నిరసనలను, రాజ్యాంగ సంస్థల్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. ప్రతిపక్షాలు దేశంలో అరాచకాన్ని వ్యాప్తి చేయాలని చూస్తోందని బీజేపీ, జేడీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముంబైలో ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగితే అరాచకం వ్యాపించడం ఖాయమని, సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించాలి.మాకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉంది, దేశాన్ని కాపాడగలిగేది సుప్రీంకోర్టు మాత్రమే. మన సొంత దేశంలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోతే మనం ఏం చేయగలం? ఇది అరాచకాన్ని వ్యాపింపజేస్తుంది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించాలి.’’ అని అన్నారు.

మరోవైపు.. సంజయ్ రౌత్ లాగే, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఇలాంటి పోస్టునే చేశారు. దీనిపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య మాట్లాడుతూ.. అల్బేనియాలో సుప్రీంకోర్టును తగలబెట్టడాన్ని సంజయ్ రౌత్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సమర్థిస్తున్నాయని ఆరోపించారు. సంజయ్ రౌత్ భారత రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను విమర్శించారు, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని దూషించి, అల్బేనియా సుప్రీంకోర్టును తగలబెట్టడాన్ని సమర్థిస్తున్నారని మండిపడ్డారు.