NTV Telugu Site icon

Maharashtra: ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ.. ఎస్పీకి 12 సీట్లు ఇవ్వాలంటూ ఎక్స్‌లో పోస్టు

Maharashtra

Maharashtra

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తు్న్నాయి. వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇంకోవైపు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. ఇలా ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా మేథోమథనం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో సీట్లు పంచాయితీ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఇలానే సీట్ల రగడ నడిచింది. దీంతో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో తగిన మూల్యమే చెల్లించుకున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం మహా వికాస్ అఘాడిలో సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ అధినేత అబు అజ్మీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇండియా కూటమిలో భాగంగా ఎస్పీకి 12 సీట్లు కేటాయించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్న సమయంలో గుర్తు చేయడానికే పోస్టు పెట్టినట్లు ఆయన తెలిపారు.

అబు అజ్మీ మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ, శివసేన (యుబిటి) మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇతర చిన్న పార్టీలతో సమావేశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. చాలా ఆలస్యం అవుతుందని నేను నా ట్వీట్ ద్వారా వారికి గుర్తు చేస్తున్నాను. నేను విన్నాను. కాంగ్రెస్ కూడా ఏదో ఒకటి ప్రకటించబోతోంది కాబట్టి మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోవాలని నేను వారికి చెప్పాను. ఇందులో ఎలాంటి ఆగ్రహం లేదు. రాహుల్ గాంధీ మరియు అఖిలేష్ యాదవ్ మధ్య సంబంధాలు కూడా బాగానే ఉన్నాయని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను.’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కూటమి నుంచి 12 సీట్లు అడుగుతున్నాను. నేను చాలా సీట్లు సాధించడానికి ప్రయత్నిస్తాను.’’ అని అబు అజ్మీ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో మాట్లాడకుండా అభ్యర్థిని ప్రకటిస్తే తప్పు అని అభిప్రాయపడ్డారు.

‘‘నేను రేపు మహారాష్ట్రకు వెళ్తున్నాను. మా ప్రయత్నం భారత కూటమితో కలిసి పోటీ చేయడమే. మేము సీట్లు అడిగాము. మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఎక్కువ సీట్లు వస్తాయని మేము ఆశిస్తున్నాము.’’ అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న ఒకే దశలో జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) సంకీర్ణంలో భాగంగా కాంగ్రెస్ మరియు ఏకీకృత శివసేన 288 సీట్లలో 154 గెలుచుకున్నాయి. అయితే ఈసారి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిని ఎదుర్కోవడానికి శివసేన (యూబీటీ), శరద్ పవార్‌కి చెందిన ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాల్లో 30 స్థానాలను ఎంవీఏ గెలుచుకుంది. అధికార కూటమికి 17. ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.