Site icon NTV Telugu

Salman Khan: ఆ సింగర్‌ను చంపినట్టే.. నిన్నూ చంపేస్తాం

Salman Khan Threat Letter

Salman Khan Threat Letter

కొన్ని రోజుల క్రితం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే! ఆయన తన స్నేహితులతో కలిసి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆ సింగర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా అతడ్ని చంపినట్టే, నిన్ను కూడా చంపుతామంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాదు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను కూడా చంపుతామంటూ ఆ లేఖలో హెచ్చరించారు. అయితే, ఈ లేఖ ఎవరు రాశారన్నది తెలియాల్సి ఉంది. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సల్మాన్.. పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సల్మాన్‌ను బహిరంగంగా చంపుతానంటూ లారెన్స్ బిష్ణోయ్ ప్రతిజ్ఞ చేశాడు. అందుకు కారణం.. సల్మాన్ కృష్ణజింకలను వధించినట్టు ఆరోపణలు రావడమే! కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు ప్రాణప్రదంగా చూసుకుంటారు. వాటిని చంపాడని ఆరోపణలు వచ్చినప్పుడు, సల్మాన్‌పై నాడు బిష్ణోయ్ తెగవారు కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కూడా ఈ బిష్ణోయ్ తెగకు చెందినవాడే. ఈ నేపథ్యంలోనే.. సల్మాన్‌కు బెదిరింపు లేఖ వెనుక బిష్ణోయ్ ముఠా హస్తం ఉండొచని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుండగా.. ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ తన సహనటులతో కలిసి కృష్ణజింకల్ని వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్‌పై 9/51 ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972తో పాటు ఆయుధాల చట్టంలోని 3/25, 3/27 సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. 2018లో జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ళ శిక్ష విధించింది. అయితే, ఆ తర్వాత సల్మాన్ బెయిల్ మీద వచ్చాడు. ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది.

Exit mobile version