Jagadguru: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలను వదిలిపెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్య మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దేవుడి రంగు కాషాయమని, కాషాయ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని వాదించారు.
‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ రాశారు..? శివాజీ కాషాయ పతాకంతో దేశాన్ని మహారాష్ట్రని ఏకం చేశారు. సూట్లు, బూట్లు ధరించిన వారు దేశంలో రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు.
Read Also: Harish Rao: రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు..
యోగి వ్యాఖ్యలు ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనం అవుతాం) అనే నినాదాన్ని ఉద్దేశిస్తూ ఖర్గే ఇటీవల విమర్శలు గుప్పించారు. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సోమవారం ముంబైలో అన్నారు. ‘‘చాలా మంది నాయకులు సాధువుల వేషధారణలో ఉంటూ ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారారని అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వారు కాషాయ బట్టలు వేసుకుంటారు. తలపై వెంట్రుకలు లేవు. తెల్లబట్టలు వేసుకోవాలి, సన్యాసి అయితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను బీజేపీకి చెబుతా’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. కాషాయం ధరించి ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యోగిపై మండిపడ్డారు.
జగద్గురు రాంభద్రచార్య మాట్లాడుతూ.. యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని సమర్థించారు. మనం విడిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. వర్గాలు వేరైనప్పటికీ హిందువులు అంతా ఒక్కటే అని చెప్పారు. మనం ఒక్కటిగా ఉంటే ఎవరూ హాని చేయలేరని, ఒక్క వేలు బలహీనంగా ఉన్నా, పిడికిలి బలంగా ఉంటుందని చెప్పారు.