NTV Telugu Site icon

S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్‌తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..

S Jaishankar

S Jaishankar

S Jaishankar: భారత్-మాల్దీవుల మధ్య ఏర్పడిన దౌత్యవివాదం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు వస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ మొయిజ్జూ, చైనా అనుకూల విధానాలు, భారతవ్యతిరేక విధానాలు అవలంభించడంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే, ఇప్పుడిప్పుడే ఆ దేశానికి భారత అవసరం ఏంటనేది తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం సంబంధాల మరింతగా పెరిగే విషయాన్ని జైశంకర్ నొక్కి చెప్పారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఆహ్వానం మేరకు జైశంకర్ ఆగస్టు 11 వరకు మూడు రోజుల పర్యటనకు వెళ్లారు.

Read Also: Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..

“అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జును పిలవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలియజేసారు. మా ప్రజలు మరియు ప్రాంతం ప్రయోజనాల కోసం భారతదేశం-మాల్దీవుల సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం” అని జైశంకర్ సమావేశ ఫోటోతో పాటు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వరసగా మూడో సారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో జరిగిన ప్రమాణస్వీకారానికి ముయిజ్జూ హాజరయ్యారు. ముయిజ్జూతో సమావేశానికి ముందు ఆ దేశ రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్‌తో జైశంకర్ సమావేశమయ్యారు. మాల్దీవుల్లో పెరుగుతున్న చైనా ఉనికి, ద్వైపాక్షిక భద్రతా సహకారం, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడంలో ‘‘భాగస్వామ్య ఆసక్తి’’ గురించి ఇరువురు నేతలు చర్చించారు.

‘ఇండియా అవుట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ముయిజ్జూ, బాధ్యతలు చేపట్టిన వెంటనే మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఇదే కాకుండా తన తొలి విదేశీ పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లి, ఆ దేశంతో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాడు. ఇదే కాకుండా ఈ ఏడాది ప్రధాని మోడీ లక్షద్వీప్ వెళ్లిన సమయంలో, ఆ దేశానికి చెందిన పలువురు మంత్రులు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. భారత ప్రజలు మాల్దీవుల్ని బాయ్‌కాట్ చేశారు. అప్పటి నుంచి ఇండియా నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య పడిపోవడంతో మాల్దీవులకు అసలు విషయం బోధపడింది. తిరిగి తమ దేశానికి రావాలంటూ భారతీయులను ఆహ్వానించడం మొదలుపెట్టారు.