Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి

  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం
  • ప్రవర్తనతో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
  • భారతీయ కుటుంబాలుకు పిలుపు
Mohan Bhagwat

Mohan Bhagwat

భారతీయ కుటుంబాలు, ప్రతి వ్యక్తి తమ ప్రవర్తన ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలంటే ప్రవర్తన కావాలని.. అప్పుడే భారత్ తన విశ్వమానవ ధ్యేయాన్ని విజయవంతంగా నెరవేర్చగలదని పేర్కొన్నారు.

స్వయంసేవకుల జీవిత లక్ష్యం, దేశ సేవ, భారత భవిష్యత్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభూమి సేవకు స్వచ్ఛందంగా అంకితమై నిరంతరం నిజమైన స్వయంసేవకులుగా మారేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పాన్ని మనం స్వచ్ఛందంగా స్వీకరించాం. నిజమైన స్వయంసేవకులుగా ఎదగడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ఒక స్వయంసేవకుడు సాధించగల పరిపూర్ణతకు ఎలాంటి హద్దులు లేవు. ఆ పరిపూర్ణత శిఖరాన్ని డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ జీవితంలో మనం చూశాం.’’ అని తెలిపారు. ఆ పరిపూర్ణత సాధించాలంటే నిరంతర సాధన అవసరమని పేర్కొన్నారు. సౌకర్యాలతో అలాంటి సాధన సాధ్యం కాదని.. క్రమశిక్షణ, త్యాగం, నిరంతర కృషి ద్వారానే నిజమైన స్వయంసేవకుడిగా ఎదగవచ్చని వివరించారు.

ప్రపంచానికి భారత్ ప్రత్యేకమైన సందేశాన్ని అందించే బాధ్యత కలిగిన దేశమని మోహన్ భగవత్ అన్నారు. ‘‘భారత్ తన ప్రపంచ ధ్యేయాన్ని నెరవేర్చాలంటే.. ముందుగా ఆ ఆదర్శాన్ని తన జీవితంలో ఆచరణలో చూపించే దేశంగా మారాలి. ప్రపంచానికి ఏ జీవన విధానాన్ని చూపించాలనుకుంటుందో, అదే విధానాన్ని భారతీయులు తమ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఆచరించాలి.’’ అని సూచించారు.

దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజలు సంఘ్ పనితీరును పరిశీలించి ప్రశంసిస్తున్నారని.. తమ దేశ యువతకు కూడా ఇలాంటి శిక్షణ అందించాలని కోరుతున్నారని తెలిపారు. ‘‘దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది సంఘ్‌ను పరిశీలించడానికి వస్తున్నారు. ఐదు ఖండాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకే విషయం చెబుతున్నారు. మీరు సంఘ్‌లో యువతకు ఇస్తున్న శిక్షణ మాకు కూడా ఇవ్వండి. మా దేశాల్లోని యువతకు కూడా అలాంటి శిక్షణ అందించేందుకు మమ్మల్ని సిద్ధం చేయండి అని కోరుతున్నారు.’’ అని వెల్లడించారు.

అయితే సంఘ్ ప్రయాణం ఇంకా కొనసాగుతోందని.. ముందున్న లక్ష్యాలు చాలా పెద్దవని అన్నారు. ‘‘వ్యక్తిత్వ నిర్మాణానికి ఆదర్శంగా నిలవడం దగ్గరే సంఘ్ పని ఆగిపోదు. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. మన ప్రయాణం ఇంకా కొనసాగుతోంది.’’ అని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పటికీ భారతదేశం మానవాళికి దారి చూపగల దేశమని విశ్వసిస్తోందని మోహన్ భగవత్ చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనేక రచనలు, ప్రసంగాల్లో కూడా భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుందని, మానవాళి ఆ మార్గాన్నే అనుసరించాలని పేర్కొంటున్నారు. అయితే అది జరగాలంటే ముందుగా భారత్ తన మూల విలువల ఆధారంగా అత్యున్నత వైభవం, అత్యున్నత శక్తిని సాధించిన దేశంగా ఎదగాలి.’’ అని వ్యాఖ్యానించారు. భారత్ బలమైన, ఆదర్శవంతమైన దేశంగా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచానికి నిజమైన నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఆయోధ్య రామమందిర విరాళాల స్కామ్‌పై తొలిసారి ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఈ ఘటనతో రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రకటనలో తెలిపింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ తరపున సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే ఈ ప్రకటనను విడుదల చేశారు.