కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలిస్తున్న వాహనంపై దాడి చేసి భారీగా నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిపోయారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
కర్ణాటకలోని విజయపుర జిల్లా శివారు పట్టణం చడవణలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఏడు, ఎనిమిది మంది సభ్యులు కలిగిన ముఠా లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. గన్స్, కర్రలు, రాడ్స్‌తో బెదిరించారు. అంతేకాకుండా మేనేజర్, ఉద్యోగుల చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు.
బ్యాంక్ మేనేజర్, ఉద్యోగులు తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో దొంగల ముఠా ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడింది. మేనేజర్ దగ్గర ఉన్న సేఫ్టీ లాకర్ తాళాలు తీసుకుని లాకర్స్ ఓపెన్ చేసి రూ.8 కోట్ల నగదు, రూ.50 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం వాహనాల్లో దొంగల ముఠా మహారాష్ట్ర వైపు వెళ్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు… దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు. భారీ ఎత్తున చోరీ జరగడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని గాలిస్తున్నారు.
