NTV Telugu Site icon

Karnataka: రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లు.. ప్రభుత్వం ఆగ్రహం..

Rupa Vs Rohini

Rupa Vs Rohini

Roopa vs Rohini: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ అధికారుల మధ్య వార్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ వేదికగా రూపా, రోహిణి ఫోటోలు షేర్ చేసి ఆరోపణలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ అధికారుల నియమావళిని ఉల్లంఘించారని, రోహిణి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రోహిణి.. రూప మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ సీఎస్ వందితా శర్మను కలుసుకున్న రోహిణి, రూపపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు రోహిణి ఫోన్ తో పాటు తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఆమె భర్త సుధీర్ రెడ్డి బాగలగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మైసూర్ జిల్లా కలెక్టర్ గా రోహిణి పనిచేస్తున్న సమయంలో అప్పటి మంత్రి మహేష్ తో విభేదాలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మంత్రి భార్య భవంతి నిర్మిస్తుందని వచ్చిన ఆరోపణలపై రోహిణి విచారణకు ఆదేశించారు. విచారణలో ఇది ప్రభుత్వ స్థలం కాదని.. నిబంధనల మేరకే కట్టారని తేలింది. ఆ తరువాత ఫిర్యాదు మేరకు స్పందించాల్సి వచ్చిందని తనది పొరపాటని రోహిణి, మంత్రికి లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఇటీవల రోహిణి, మరో ఐఏఎస్ అధికారితో కలిసి మహేష్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఐపీఎస్ రూప స్పందిస్తూ.. మంత్రి వద్దకు రాజీకి వెళ్లడం నిబంధనలకు విరుద్ధం అంటూ విమర్శలు చేయడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లింది.  సిన్సియర్ ఆఫీసర్ గా రోహిణికి పేరుంది. తెలుగు అమ్మాయి అయిన రోహిణి అక్రమాలపై ఉక్కుపాదం మోపింది.

Read Also: Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. 6.4 తీవ్రతతో కంపించిన భూమి..

ప్రభుత్వం ఆగ్రహం.. చర్యలకు సీఎం ఆదేశం..

ఇదిలా ఉంటే వీరిద్దరి ప్రవర్తన కన్నడ ప్రభుత్వానికి చికాకులు తెప్పిస్తోంది. సివిల్ ఆఫీసర్లని మరిచి ఇద్దరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు చేసుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఈ ఇద్దరి వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ వందితా శర్మకు, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాల జారీ చేశారు.

దీనిపై కర్ణాటక హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చొదని అన్నారు. సీఎం ఇప్పటికే సీఎస్, డీజీపీలో చర్చించారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ లను ప్రజలు దైవసమానులగా చూస్తారని.. కానీ వారిద్దరు తమ హోదాలను అవమానిస్తున్నారని, వారి వ్యక్తిగత వైరమే ఇందులో కనిపిస్తోందని, వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని, వీధి గొడవగా మార్చొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిణి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు కాగా, రూప స్వస్థలం కర్ణాటకలోని దావణగెరె.