Amit Shah: ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయలు, రోహింగ్యాలే టార్గెట్‌గా శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం శాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఢిల్లీని సేఫ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అమిత్ షా ఆదేశించారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు సహా అనధికార వలసదారులతో వ్యవహరించేటప్పుడు స్పష్టమైన, వేగవంతమైన చట్టపరమైన విధానాన్ని కలిగి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేసింది, డబల్ స్పీడ్‌తో ఢిల్లీనీ అభివృద్ధి చెయ్యాలని ఆయన ఆదేశించారు. జాతీయ భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్రమ చొరబాటు దారులకు సాయం చేసే నెట్వర్క్‌లపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. పోలీసుల పనితీరుపై సమీక్ష నిరంతరం కొనసాగాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతర్‌రాష్ట్ర ముఠాలు, డ్రగ్స్ నెట్వర్క్‌పై సీరియస్ యాక్షన్ అమలు చేయాలని కోరారు.
Read Also: Tamil Nadu: సింగిల్ నిమ్మకాయకు రూ. 13,000.. శివరాత్రి వేలంలో రికార్డ్ ధర..
ఢిల్లీలో నిర్మాణాల కోసం పోలీసుల అనుమతి అవసరం లేదని, ఈ రూల్ తొలగించాలని అమిత్ షా సూచించారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులను త్వరగా పరిష్కరించాలని స్పెషల్ ప్రాసిక్యూటర్లను నియమించాలని ఆదేశించారు. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీ పోస్టులకు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లలో పబ్లిక్ హియరింగ్లు నిర్వహించాలి, అందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఢిల్లీలో మహిళలు పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరారు. రానున్న వర్షాకాలానికి సంబంధించి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు.