Site icon NTV Telugu

Robert Vadra: “దేశం నన్ను కోరుకుంటోంది”.. పొలిటికల్ ఎంట్రీపై ప్రియాంకాగాంధీ భర్త..

Robert Vadra

Robert Vadra

Robert Vadra: ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. అమేథీలో తాను పోటీ చేయాలనే కోరికను వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని అన్నారు. అమేథీలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ఎలాంటి హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.

‘‘ దేశం మొత్తం నుంచి గొంతు వినిపిస్తోంది. నేను ఎప్పుడూ దేశ ప్రజల మధ్య ఉన్నందున క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వారు కోరుకుంటున్నారు. ప్రజలు ఎల్లప్పుడూ నన్ను వారి ప్రాంతంలో చూడాలని కోరుకుంటున్నారు. నేను 1999 నుంచి అమేథీలో ప్రచారం చేస్తున్నాను. సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ తన వాగ్దానాలను నెరవేర్చలేదు’’ అని రాబర్ట్ వాద్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జరిగిన రెండు దశల్లో బీజేపీ కన్నా కాంగ్రెస్ ముందుందని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీని వారు వదిలించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రాహుల్, ప్రియాంకా చేస్తున్న కృషిని చూసి దేశ ప్రజలు గాంధీ కుటుంబంతో ఉన్నారని చెప్పారు.

Read Also: Ponguleti Srinivasa Reddy: ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నాం..

ఇటీవల రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. అమేథీ ప్రజలు తాను పార్లమెంట్ సభ్యుడిగా భావిస్తే, నేను పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. గాంధీ కుటుంబ సభ్యుడు తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభమై, ఎంపీని కావాలని అనుకుంటే, తాను అమేథీ నుంచే ప్రాతినిధ్యం వహించాలని వారు ఆశిస్తున్నారని చెప్పారు. అంతకుముందు అమేథీలోని గౌరీకంజ్ ప్రాంతంలో బుధవారం పార్టీ కార్యాలయం వెలుపల రాబర్ట్ వాద్రా పోస్టర్లు దర్శనమిచ్చాయి.

ఇప్పటి వరకు కాంగ్రెస్ అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, అయేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 26 తర్వాత దీనిపై నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర్ ప్రదేశ్‌‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం 80 స్థానాలు ఉంటే 17 స్థానాల్లో కాంగ్రెస్, 63 సీట్లలో ఎస్పీ పోటీ చేస్తోంది. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలకు మే 20న ఐదో దశలో పోలింగ్ జరగనుంది.

Exit mobile version