Site icon NTV Telugu

Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా జడేజా భార్య.. ఈనెల 12న ప్రమాణం

Rivaba Jadeja

Rivaba Jadeja

Rivaba Jadeja: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా అద్భుత రీతిలో విజయం సాధించారు. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రివాబా జడేజా సమీప అభ్యర్థిపై 61,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజాగా ఆమె మరో జాక్‌పాట్ కొట్టారని ప్రచారం జరుగుతోంది. భూపేంద్ర పటేల్ కేబినెట్‌లో రివాబాకు కూడా స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు పటీదార్ రిజర్వేషన్ల పోరాటంతో వెలుగులోకి వచ్చిన హార్ధిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్ కూడా మంత్రి పదవి దక్కించుకోనున్నట్లు సమాచారం. ఈనెల 12న గుజరాత్‌లో భూపేంద్ర పటేల్ కేబినెట్ కొలువుదీరనుంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గంతో సహా గురువారం రాజీనామా చేశారు.
Read Also: Virat Kohli: కోహ్లీకి కలిసొచ్చిన రాహుల్.. రికార్డులే రికార్డులు

ఈనెల 12న కొత్త కేబినెట్‌లో సీఎం భూపేంద్ర పటేల్ సహా 12 మంది వరకు మంత్రులుగా ప్రమాణం చేయవచ్చని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కానున్నారు. కాగా రివాబా జడేజా మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఆమె 2019లో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరకముందు ఆమె కర్నిసేన మహిళా విభాగం చీఫ్‌గా పనిచేశారు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. రివాబాకు మద్దతుగా రవీంద్ర జడేజా భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేశాడు. సొంత చెల్లెలు నైనా జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

Exit mobile version