RG Kar Case: కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు స్థానిక తలాపోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మోండల్‌కి సీల్దా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Andhra Pradesh: రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నిక
ఆగస్టు 09న ఆర్జీ కర్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో మోండల్ జాప్యం చేశారని, సందీప్ ఘోష్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు వెస్ట్ బెంగాల్ పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐకి ట్రాన్‌ఫర్ అయింది. సీబీఐ వీరిద్దరిని అరెస్ట్ చేసింది.
అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM), సీల్దా కోర్టు, ఇద్దరు నిందితులపై చార్జిషీట్ తప్పనిసరిగా 90 రోజుల వ్యవధిలో దాఖలు చేయనందున వారికి బెయిల్ మంజూరు చేసినట్లు సందీప్ ఘోష్ తరపు న్యాయవాది తెలిపారు. ఇదిలా ఉంటే, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన ఆర్థిక అవకతవకల కేసులో సందీప్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అత్యాచారం-హత్య కేసులో బెయిల్ లభించినప్పటికీ సందీప్ ఘోష్ జైలులోని ఉండాల్సి ఉంది. ఇక మోండల్ మాత్రం జైలు నుంచి విడుదల కానున్నారు.