NTV Telugu Site icon

RG Kar Case Verdict: కోల్‌కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..

Rg Kar Case Verdict

Rg Kar Case Verdict

RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో, కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణలో మొదట సంజయ్ రాయ్ తాను నేరం చేశానని ఒప్పుకున్నప్పటికీ, తర్వాత తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అయితే, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత సంజయ్ రాయ్ నేరం చేసినట్లు కోర్టులో తేలింది. సోమవారం ఈ కేసులో కోర్టు శిక్షల పరిమాణాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వందలాది మంది ప్రజల నిరసనలు చేశారు. కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా పని చేస్తున్న సంజయ్ రాయ్.. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్‌లో వైద్యురాలిపై నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు.

Read Also: Breaking News: హైదరాబాద్‌ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలతో, కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఆగస్టు 13న 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. 66 రోజుల పాటు జరిగిన విచారణలో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు తగిని డీఎన్ఏ నమూనాలు, నేర ప్రాంతంలో దొరికిన వెంట్రుకలతో కూడిన నివేదికను సమర్పించింది. ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసే సమయంలో నిందితుడి శరీరంపై ఐదు గాయాలు కనిపించాయని సీబీఐ తరపు లాయర్ వెల్లడించారు. అంతేకాకుండా, అతడు సెమినార్ హల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించకుండా పోయిన అతని బ్లూటూత్, నేరం జరిగిన ప్రదేశంలో దొరికిందని సీబీఐ సీల్దా కోర్టులో చెప్పారు.