Uddhav Thackeray: ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఠాక్రేల ఆధిపత్యానికి గండికొడుతూ.. 25 ఏళ్ల తర్వాత బీజేపీ+షిండే శివసేన సత్తా చాటాయి. 227 స్థానాలు ఉన్న ముంబైలో మెజారిటీ మార్క్ 114. బీజేపీ 89 స్థానాలు సాధించగా, షిండే శివసేన 29 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం సంఖ్య 118, ఇది మెజారిటీ మార్కును సులభంగా దాటుతుంది. అయితే, ఇక్కడే షిండే సేన ‘‘కింగ్ మేకర్’’ స్థానంలో నిలిచింది. తమకే ముంబై మేయర్ పీఠం కావాలని బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏక్‌నాథ్ షిండే తన కార్పొరేటర్లను ఫైవ్-స్టార్ హోటల్‌లో ఉంచారు కాబట్టి అతను బీజేపీకి భయపడుతున్నాడు. వారు ఒకసారి చీలిపోయినప్పుడు, మళ్లీ చీలిపోగలరని అతనికి తెలుసు” అని అన్నారు. 2022లో శివసేన రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల తర్వాత శివసేన+కాంగ్రెస్+ఎన్సీపీ ప్రభుత్వం పడిపోయి, బీజేపీ + షిండే శివసేన అధికారాన్ని ఏర్పాటు చేశాయి.
Read Also: Iran: ట్రంప్ ఒక ‘‘క్రిమినల్’’.. ఇరాన్ పరిణామాలకు కారణం ఆయనే..
షిండే శివసేన కార్పొరేటర్లు ‘‘రిసార్ట్ పాలిటిక్స్’’ మొదలుపెట్టిన నేపథ్యంలో ఉద్ధవ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 29 మంది శివసేన కార్పొరేటర్లు ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌కు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. 71 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ముంబైలోని మరాఠా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి సత్తా చాటింది. తమ పట్టును నిలుపుకుంది.
ముంబైలో తమ మేయర్ ఉండాలన్నదే తమ కల అని, కానీ సంఖ్యా బలం తమకు అనుకూలంగా లేదని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ కాగితంపై శివసేనను అంతం చేయగలదు కానీ, క్షేత్రస్థాయిలో కాదని అన్నారు. కానీ బీజేపీ కాగితాలపైనే కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో లేదని అన్నారు. ఫిరాయింపుదారుల్ని వారి వైపు తిప్పుకోవడానికి మహాయుతి ప్రభుత్వం దుర్వినియోగాలకు పాల్పడిందని, అధికారం, డబ్బు, బెదిరింపులకు పాల్పడిందని ఠాక్రే ఆరోపించారు. మా సభలకు భారీగా జనాలు వచ్చారని, బీజేపీ కార్యక్రమాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని, అయినా వారికి అన్ని సీట్లు ఎలా వచ్చాయని అనుమానాలు ఉన్నాయని అన్నారు.
