Religion no basis for registering marriage, says Kerala High court: మతాంతర వివాహం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని ఓ హిందూ జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాాలు జారీ చేసింది. దంపతుల తల్లిదండ్రులు వేరే మతానికి చెందిన వారు కావడంతో వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం సరైన కారణం కాదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఇద్దరికి పెళ్లి జరిగిందా..? లేదా? అనేది మాత్రమే ముఖ్యం అని తెలిపింది.
కేరళ వివాహ నమోదు నిబంధనలు 2008 ప్రకారం వివాహాన్ని నమోదు చేయడానికి మతం ప్రాతిపదిక కాదని పేర్కొంది.. వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మహిళ తల్లి ముస్లిం అయినందున, హిందూ యువకుడితో వివాహాన్ని నమోదు చేయలేమన్న ప్రభుత్వ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పీవీ కున్హికృష్ణన్.
Read Also: Chandramukhi 2: చంద్రముఖి2 కోసం రంగంలోకి కాజల్ అగర్వాల్..?
కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఉదయమ్ పేరూర్ లో పీఆర్ లాలన్, ఐషా నివసిస్తున్నారు. ఈ జంట డిసెంబర్ 2, 2021లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొచ్చి కార్పొరేషన్ సెక్రటరీకి తన వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఐషా తల్లి ముస్లిం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం కింద మాత్రమే వారి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చని అధికారులు వీరిద్దరికి తెలియజేశారు.
దీనిపై లాలన్-ఐషా దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2008లో అమలులోకి వచ్చిన వివాహ నమోదు నిబంధనలను మహిళలు, పిల్లల హక్కు పరిరక్షణ కోసం రూపొందించామని పేర్కొంది కేరళ హైకోర్టు పేర్కొంది. అందువల్ల దంపతుల తల్లిదండ్రులు రెండు మతాలకు చెందిన వారు కావడంతో వివాహ రిజిస్ట్రేషన్ చేయకపోవడం సరైనది కాదని పేర్కొంది. వివాహం జరిగిందా లేదా అనేదే ముఖ్యమని కోర్టు పేర్కొంది. హైకోర్టు తన ఉత్తర్వులను స్థానిక స్వపరిపాలన కార్యదర్శకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
