NTV Telugu Site icon

Amarnath Yatra: యాత్ర కోసం 3 లక్షల మంది భక్తుల రిజిస్ట్రేషన్లు

Amarnatyatra

Amarnatyatra

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మంచురూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏకంగా ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు( ఎస్ఏఎస్బీ) వెల్లడించింది. 43 రోజుల యాత్ర కోసం యాత్రికుల నమోదును ఏప్రిల్ 11న ప్రారంభించారు.  దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566 శాఖల ద్వారా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. యాత్ర ముగిసే వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.

రెండు మార్గాల ద్వారా యాత్ర ప్రారంభం కానుంది. దక్షిణ కాశ్మీర్ లోని పహల్గామ్ లోని 48 కిలోమీటర్ల నున్వాన్ నుంచి, సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్ బాల్ లోని 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగనుంది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్ల నుంచి అమర్ నాథ్ యాత్ర జరగలేదు. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడే మొదలైంది. 13 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 75 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఆరువారాల కన్నా ఎక్కవ గర్భం దాల్చిన స్త్రీలు యాత్రకు అనుమతించబడరు. అమర్ నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం అయి ఆగస్టు 11న ముగియనుంది.

ఇదిలా ఉంటే యాత్ర ప్రారంభం దగ్గర పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు హై అలర్ట్ గా ఉన్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ బార్డర్ ను జల్లెడ పడుతున్నారు. దీని కోసం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. యాత్ర మార్గంలో సీసీ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కరోనా కన్నా ముందు 2019లో  3.42 లక్షల మంది ప్రజలు శివలింగాన్ని దర్శించుకున్నారు.